వివేకా హత్య కేసు..సంచలన విషయాలు వెల్లడించిన వాచ్ మెన్!

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పురోగతి. ఇది సుపారీ హత్యగా వాచ్ మెన్ వెల్లడించినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు శుక్రవారం నాడు వాచ్ మన్ రంగన్నను జమ్మలమడుగు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. సెక్షన్ 164 కింద వాచ్ మన్ రంగన్న వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేశారు. ఈ సమయంలోనే రంగన్న కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చారని, ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో తేలినట్లు , చెబుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి దాదాపు 45 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు. సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పారంటున్నారు. విచారణ నివేదిక బహిర్గతం అయితే తప్ప..ఇందులోని వాస్తవాలు ఏంటో తేలవు.