వివేకా హత్య కేసు..ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తాం
హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భారీ ఆఫర్లు
ఏపీలో సంచలనం రేపిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత కీలకమైన ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి కొంత మంది భారీ ఆఫర్లు ఇవ్వచూపారు. పది నుంచి ఇరవై ఎకరాల భూమితోపాటు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాలను దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనటంతో కొత్త కలకలం ప్రారంభం అయింది. ఇటీవల సీబీఐ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ హత్య వెనక ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు మరికొంత మంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని..అయితే దీనిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.
దస్తగిరి సీబీఐకి హత్య వివరాలు వెల్లడించకుండా ఉండటంతోపాటు కేసును పక్కదారి పట్టించేందుకు భారీ ఎత్తున ఆఫర్లు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. కోర్టు ముందు వివేకా హత్య కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. వాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని దస్తగిరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు వెల్లడించారు. భరత్ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడన్న దస్తగిరి తెలిపాడు. వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలు సీబీఐకి చెప్పొద్దని..అదే సమయంలో కోర్టులో చెప్పిన విషయం ఏమిటో కూడ తమకు తెలపాలని కోరినట్లు వెల్లడించారు. తాజాగా వివేకా హత్య కేసు విచారణను పులివెందుల కోర్టు నుంచి కడప కోర్టుకు బదిలీ చేశారు.