Telugu Gateway
Andhra Pradesh

వివేకా హ‌త్య కేసు..సునీల్ యాద‌వ్ అరెస్ట్

వివేకా హ‌త్య కేసు..సునీల్ యాద‌వ్ అరెస్ట్
X

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ కీల‌క ముంద‌డుగు వేసింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం అరెస్ట్ ల‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమ‌వారం నాడే సునీల్ కుమార్ యాద‌వ్ ను అరెస్ట్ చేసింది. ఈ విష‌యాన్ని సీబీఐ మంగ‌ళ‌వారం నాడు అధికారికంగా నిర్ధారించింది. దీంతో ఈ హ‌త్య కేసుకు సంబంధించి కీల‌క ముంద‌డుగు ప‌డిన‌ట్లు అయింది. నిన్న సాయంత్రం సునీల్ యాద‌వ్ ను గోవాలో అరెస్టు చేసిన అధికారులు మంగ‌ళ‌వారం నాడు గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ తనను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీతో టార్చర్ పెడుతోందంటూ సునీల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. త‌ర్వాత ఆయన పులివెందులలోని తన ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. సునీల్ గోవాలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు గోవాకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ తోపాటు ఇత‌ర కీల‌క అనుమానితుల‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Next Story
Share it