వివేకా హత్య కేసు..ఆయుధాలు స్వాధీనం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో బుధవారం నాడు పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్యకు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్న ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో కీలక అనుమానితులుగా ఉన్న సునీల్ యాదవ్, దస్తగిరి తదితర ఇళ్ళలో సోదాలు జరిపి కొన్ని ఆధారాలు సేకరించారు. పలు కోణాల్లో సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి విచారణ సాగిస్తున్నారు. ఈ కేసులో విచారణలో భాగంగా వైఎస్ అభిషేక్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు కీలక మలుపులు తిరుగుతున్న తరుణంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆయన అల్లుడు మరోసారి సీబీఐ అధికారులతో సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ హత్య ఎవరు చేశారు..దీని వెనక ఉన్నది ఆర్ధిక కోణాలా? లేక రాజకీయ కారణాలా అన్న అంశంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే సీబీఐ సోదాల అనంతరం సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. సీబీఐ వేధింపులు భరించలేకే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసు కావటంతో అందరూ సీబీఐ విచారణ వైపు ఆసక్తిగా గమనిస్తున్నారు.