వివేకా హత్య కేసు..సీబీఐ కీలక ప్రకటన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కీలక పరిణామం. డెబ్బయి అయిదు రోజుల విచారణ అనంతరం సీబీఐ ఇచ్చిన పత్రికా ప్రకటన ఆసక్తికరంగా మారింది. విచారణ తుది దశకు చేరిందని భావిస్తున్న తరుణంలో ఈ ప్రకటన చూసి కొంత మంది విస్మయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఎవరైనా ఖచ్చితమైన సమాచారం అందిస్తే వారికి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. అదే సమయంలో సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు.
ప్రజలు ఎవరి దగ్గర అయినా ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని పత్రికాముఖంగా సీబీఐ కోరింది. ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను సీబీఐ విచారించింది. సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారులకు తెలపవచ్చంటూ వారి నెంబర్లు కూడా ప్రకటనలో ప్రచురించింది.