Telugu Gateway
Andhra Pradesh

అందుకే వీఎంఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ లో వంద అడుగుల రోడ్ కు ఓకే

అందుకే వీఎంఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ లో వంద అడుగుల రోడ్ కు ఓకే
X

వైసీపీ సన్నిహితులకు మేలు చేసేలా కూటమి సర్కారు నిర్ణయం వెనక కథ ఏంటి?

వాటాలే కారణం అని టీడీపీ నేతల్లో చర్చ

వైసీపీ హయాంలో వ్యతిరేకించి..ఇప్పుడు గ్రీన్ సిగ్నల్

వైజాగ్ లోని దసపల్లా భూములు రాజకీయ నేతలకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ...వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఈ భూముల విషయంలో తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. మీరు దోచుకుంటున్నారు అంటే మీరు దోచుకుంటున్నారు అంటూ ఆరోపణలు గుప్పించుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి ఈ వేల కోట్ల రూపాయల భూముల్లో వాటాలు పంచుకోవటానికి సిద్ధం అయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములను నిషేధిత 22 ఏ జాబితా నుంచి తొలగించారు. ఇందుకు కోర్టు ఆదేశాలను సాకుగా చూపించి పని కానిచ్చేశారు. ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందే అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సన్నిహితులకు చెందిన కంపెనీలతో ఈ భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. భూమి హక్కుదారులకు అతి తక్కువ వాటా ఇచ్చి..డెవలపర్లు ఎక్కువ వాటాలు తీసుకున్నారు అంటే అప్పటిలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూముల సెటిల్మెంట్ కోసం రంగంలోకి దిగి...పలు మార్లు చర్చలు జరిపింది.

ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ భూముల వ్యవహారంలో కూటమి ప్రభుత్వంలో అంతా తానై అయి చక్రం తిప్పుతున్న కీలక మంత్రి తో పాటు టీడీపీలో కిమ్ గా పేరు దక్కించుకున్న వ్యకి, ఆ మంత్రికి సన్నిహితుడు అయిన ఒక ఎంపీ కూడా ఇన్వాల్వ్ అయినట్లు చెపుతున్నారు. వీళ్ళతో వాటాల డీల్ కుదిరిన తర్వాతే ఇప్పుడు దసపల్లా భూములు ఉన్న ప్రాంతంలో వంద అడుగుల రోడ్ వేయాలని ప్రదిపాదించారు అని...ఈ మేరకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ ఆథారిటీ (వీఎంఆర్ డీఏ) మాస్టర్ ప్లాన్ లో కూడా దీన్ని పొందుపరిచినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతం లో కూడా దసపల్లా భూముల్లో వైసీపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసేలా ఈ భూముల్లో వంద అడుగుల రోడ్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఈ వ్యవహారం కోర్ట్ ....ఎన్జీటీ వరకు వెళ్ళింది.

ఇక్కడ ఉన్న 40 అడుగుల రోడ్ ను తొలుత 60 అడుగులు..తర్వాత 80 అడుగులుగా మార్చాలని ప్రతిపాదించారు ..ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో ఏకంగా వంద అడుగుల రోడ్ అభివృద్ధికి ప్రతిపాదించారు. వైసీపీ ముఖ్యనేతల సన్నిహితుల చేతుల్లో ఉన్న భూముల విలువ మరింత పెరిగేలా కూటమి ప్రభుత్వం పెద్దలు అండదండలు అందిస్తున్నారు అంటే తెరవెనక లావాదేవీలు ఎంత బాగా జరిగాయో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దసపల్లా భూముల ప్రాంతంలో వంద అడుగుల రోడ్ కు ఆమోదం దక్కితే ఈ ప్రాంతంలో భారీ ఎత్తున హై రైజ్ బిల్డింగ్స్ నిర్మించటానికి అనుమతి దక్కుతుంది. దీంతో డెవలపర్లకు దీని ద్వారా వేల కోట్ల రూపాయల మేర లాభం వస్తుంది. అందులో వాటాలు దక్కించుకోవటానికే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో సైతం దీన్ని చేర్చారు అని...గతంలో ఇక్కడ వంద అడుగుల రోడ్ ను వ్యతిరేకించిన టీడీపీ స్థానిక నేతలు ఇప్పుడు దానికి ఓకే చేయటం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం వీఎంఆర్ డీఏ చైర్మన్ గా ఎం వి ప్రణవ్ గోపాల్ ఉన్నారు. ఆయన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ కి సన్నిహితుడుగా చెపుతున్నారు. దీంతో నారా లోకేష్ కు తెలియకుండా వైజాగ్ లో ఇంతటి కీలక నిర్ణయం జరిగే అవకాశం ఉండదు అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో జోరుగా సాగుతోంది. ఈ ఒక్క డీల్ ద్వారానే వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే దసపల్లా భూముల విలువే వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక్కడ వంద అడుగులు రోడ్ కు ఓకే చేయటం ద్వారా ఈ భూములకు మరింత విలువ జోడించి ఇందులో ఇద్దరూ కలిసి వాటాలు వేసుకున్నారు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ లు ఈ భూముల విషయంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుని ఇప్పుడు ఇద్దరు కలిసి సెటిల్మెంట్ చేసుకున్నారు అనే అభిప్రాయం వైజాగ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it