జంట నగరాలుగా విశాఖ-విజయనగరం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో విశాఖపట్నం-విజయనగరం జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయాన్ని రక్షణ శాఖకే అప్పగిస్తామన్నారు. భోగాపురం రహదారి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. విశాఖలో మురికివాడలను అభివృద్ధి చేసి పేదలకు పట్టాలు ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
విశాఖ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొంత కాలం క్రితం భోగాపురంలో విమానాశ్రయం అభివృద్ధి చేసినా విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేయమని ప్రకటించిన విషయం తెలిసిందే. విస్తరణ కోసం భారీ వ్యయం చేసినందున మూసివేత కుదరదని అప్పట్లో ప్రకటించింది. ఆ తర్వాత మౌనంగా ఉంటూ వస్తోంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.