విశాఖ ఉక్కు ఉద్యమాన్ని జగన్ ముందుండి నడిపించాలి
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మరోసారి స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందు ఉండి నడిపించాలని కోరారు. ఐక్య పోరాటం ద్వారానే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమని చంద్రబాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు చంద్రబాబునాయడు శుక్రవారం ఓ లేఖ రాశారు. విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధం ఉన్నారని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగు ప్రజలు స్టీల్ ప్లాంట్‌ను సాధించారన్నారు. ఎన్నో ఆవరోధాలను అధిగమించి 1992లో స్టీల్ ప్లాంట్ పూర్తియిందన్నారు.2000 సంవత్సరంలో రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందన్నారు.
తన అభ్యర్థన, ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం తాజా పార్లమెంట్ సమావేశాల్లోనూ వంద శాతం ప్రైవేటీకరణతో ముందుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాలంటే లేఖ రాసినా కూడా మోడీ సర్కారు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవటంలేదు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష నేతలు,కార్మిక సంఘాల ప్రతినిధులతో కలుస్తానని కోరగా..ఇప్పటివరకూ అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. మోడీ సర్కారు మాత్రం ఎవరెన్ని చెప్పినా ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళ్ళటానికే రెడీ అవుతోంది.