భవిష్యత్ లో కూడా వైసీపీ స్కాం లు చెపుతారా?!
వైసీపీ లో విజయసాయిరెడ్డి ఒకప్పుడు నంబర్ టూ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ కోటరీలో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ లో కూడా వైసీపీ తరపున అన్ని వ్యవహారాలు ఆయనే చక్కబెట్టారు. తర్వాత తర్వాత జగన్ ఎందుకో దూరంపెట్టారు. అవసరం అయినప్పుడు దగ్గరకు తీసుకునేవాళ్ళు..తర్వాత పక్కన పెట్టేవాళ్ళు. కానీ ఒకప్పుడు జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కోటరీపై ఎటాక్ స్టార్ట్ చేశారు. పార్టీకి, రాజ్య సభకు రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఎంతో సానుకూలంగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు స్టైల్ మార్చారు.
బుధవారం నాడు ఆయన విజయవాడలో సిఐడీ విచారణ తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే రాబోయే రోజుల్లో ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు జగన్ పై అటాక్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో కర్త, ఖర్మ, క్రియా అంతా కూడా వైసీపీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంతి రెడ్డే అని స్పష్టం చేశారు. తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అన్నారు. ఈ కేసు ఇక్కడితో ఆగినా..ఆగకపోయినా తనకు ఏమి నష్టం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు విక్రాంతి రెడ్డి ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద వ్యవహారం నడిపించగలరా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. అయితే విజయసాయి రెడ్డి మాత్రం తనకు తెలిసి ఈ విషయంలో జగన్ కు సంబంధం లేదు అన్నారు. అదే సమయంలో ఏపీ లో జరిగిన లిక్కర్ స్కాం విషయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి . లిక్కర్ స్కాం లో కర్త,,,ఖర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. ఈ విషయం చాలా స్పష్టంగా చెపుతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వివరాలు భవిష్యత్ లో తాను చెప్పాల్సి వస్తే చెపుతానన్నారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను విజయసాయిరెడ్డి బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇటీవలే అధికార టీడీపీ లిక్కర్ స్కాం లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కమిషన్ల రూపంలో 3113 కోట్ల మేర ప్రయోజనం పొందినట్లు ప్రాధమికంగా సిఐడీ గుర్తించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వెల్లడించారు. ఎంపీకి రాజీనామా చేసిన సమయంలో ఢిల్లీ లో మీడియా తో మాట్లాడిన విజయసాయి రెడ్డి జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని.. తనలాంటి వాళ్ళు పార్టీ లో ఉన్నా..లేకపోయినా ఆయనకు ప్రజాదరణ తగ్గదని అని స్పష్టం చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా జగన్ పక్కన కోటరీ చేరింది అని...చెప్పుడు మాటలు వినటం, కోటరీని దూరం పెట్టకపోతే ఆయనకు భవిష్యత్ కష్టం అన్నారు.
జగన్ ను కలవాలంటే ఆ కోటరీకి ఏదో ఒక ప్రయోజనం కల్పించాల్సి ఉంటుంది అన్నారు. అలా అయితేనే ఎవరినైనా జగన్ దగ్గరకు పంపుతారు అని చెప్పారు. తాను ఒక్కో మెట్టు దిగితే కొంత మంది అదే మెట్టు ఎక్కుకుంటూ పోయారు అన్నారు. వైసీపీ లో ఉన్నంతకాలం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆత్మగొరవం కోసమే బయటకు వచ్చినట్లు చెప్పారు. కోటరీనే చెప్పుడు మాటలతో జగన్ కు తనను దూరం చేసింది అన్నారు. తనలాంటి వాళ్లకు ఘర్ వాపసీ ఉండదు అన్ని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించినట్లు తాను ఏమి మారలేదు అని...మారింది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. బీజేపీ లో చేరటం ఫిక్స్ అయిపోయినందునే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇంత దైర్యంగా జగన్ పై డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇప్పటికైతే తాను ఏ పార్టీ లో చేరటం లేదు అన్నారు.