పదవి ఇచ్చినందుకు ప్రచారం పీక్ కి తీసికెళ్ళిన విజయబాబు

విజయబాబు. సీనియర్ జర్నలిస్ట్. మాజీ ఆర్ టిఐ కమిషనర్.ఇటీవల ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార బాషా సంఘం అధ్యక్షులుగా నియమించింది. ఈ నియామకమే పెద్ద సంచలనంగా మారింది. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే అయన గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. పదవి ఇచ్చాక ఎవరు అయినా ఆ పని చేస్తారు. అందులో కూడా వింత ఏమి లేదు. కాకపోతే విజయబాబు చేసిన ఒక పని ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది ఏంటి అంటే సీఎం జగన్ తనకు పదవి ఇచ్చినందుకు ప్రచారాన్ని పీక్ కి తీసుకెళ్లాలని అయన నిర్ణయించుకున్నట్లు ఉన్నరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఏకంగా లెటర్ హెడ్ పై కూడా విజయబాబు సీఎం జగన్ ఫోటో పెట్టారు. మామూలుగా అయితే ఎక్కడ కూడా ప్రభుత్వ లెటర్ హెడ్స్ పై సీఎం ఫోటోలు ఉండవు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. విజయబాబు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసారు అంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతం లో ఎప్పడు ఇలా జరిగిన దాఖలాలు లేవని అంటున్నారు.
ప్రభుత్వ పధకాల లబ్దిదారులకు సీఎం లెటర్ రాస్తే అందులో ఫోటోలు పెడతారు కానీ అధికారిక లెటర్ హెడ్స్ పై మాత్రం ఇలా సీఎం ఫోటోలు వేయటం సరికాదని అధికారులు చెపుతున్నారు. తెలుగు అధికార బాషా సంఘం అధ్యక్షులుగా విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబదించిన లెటర్ ను ఈ శాఖ బాధ్యతలు చూసే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ కు అందించారు. ఇది చుసిన ఐఏఎస్ అధికారులు అవాక్కు అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రచారం పీక్ కి తీసుకు వెళ్లారు అనే విమర్శలు ఉన్న తరుణంలో విజయ్ బాబు దీన్ని కొత్త ఎత్తులకు చేర్చారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అయన చూపించిన బాటలో మంత్రులు, ఇతర అధికారులు కూడా వెళ్లిన ఆశ్చర్యం లేదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు ఇదేదో బాగుంది కాబట్టి అందరు ఇలా చేయాలనీ ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు.