Telugu Gateway
Andhra Pradesh

నాని టార్గెట్ గా చంద్రబాబుపై తిరుగుబాటు

నాని టార్గెట్ గా చంద్రబాబుపై తిరుగుబాటు
X

కేశినేని కావాలో..మేం కావాలో తేల్చుకోండి

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తెలుగుదేశం అధిష్టానం ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను ప్రకటించింది. దీన్ని అడ్డుకునేందుకు విజయవాడకు చెందిన నేతలు చేసిన ఫ్రయత్నాలు పలించలేదు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల తర్వాత విజయవాడ నేతలు సమావేశం అయి కేశినేని నాని టార్గెట్ గా..చంద్రబాబునాయుడిపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సత్తా చాటాలని చూస్తున్న తరుణంలో నగరానికి చెందిన నేతలు బహిరంగంగా ఎంపీపై విమర్శలు చేయటం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం కూడా కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంకన్నల మధ్య వార్ సాగినా తర్వాత కొద్దిగా మెత్తపడ్డారు. కానీ ఇప్పుడు ఎన్నిక కీలక దశలో మరోసారి వివాదం రాజుకోవటంతో ఈ పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారతాయి అన్న ఆసక్తి నెలకొంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా తోపాటు మరో నేత బుద్ధా వెంకన్న లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది టీడీపీలో కలకలం రేపుతోంది. బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు... ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు.

తమకెంతో బాధగా ఉందన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు. ''నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగాలేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా కూడ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని కావాలో.. అందరూ కావాలో చంద్రబాబు తేల్చుకోవాలంటూ బొండా ఉమా అల్టిమేటం జారీ చేశారు.

ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటకు గెంటించుకున్నారన్నారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. కులాలమధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వర్గాలను,విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే... రాజీనామా చేసి... ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ సింబల్, చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారన్నారు. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే... కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. నాని ముఖ్యం అనుకుంటే... తాము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉంటామని హెచ్చరించారు.

Next Story
Share it