స్టీల్ ప్లాంట్ కోసం విజయసాయిరెడ్డి పాదయాత్ర
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని, గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు పాదయాత్ర జరుగుతుందని ఆయన వెల్లడించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, అందులో అనేక సూచనలు చేశారని తెలిపారు. గనులు కూడా కేటాయించాలని ప్రధానిని కోరారని తెలిపారు. సుమారు 25 కి.మీ. మేర పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలను పిలిచినా రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏదో కంటితుడుపు చర్యలాగా కాకుండా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు.