రాజకీయ తుఫాన్ ను ప్రజలే చూస్తారు

పార్టీ ప్రకటన తర్వాత మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు అన్నది ప్రజలే తీసుకురావాలని అన్నారు. ఏపీ భవిష్యత్తు ఏ నాయకుడి చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండు తప్పు చేస్తున్నాయని తెలిపారు. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు కుటుంబాలే శాసించాలా.. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల నుంచే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా అని ప్రశ్నించారు. తండ్రి సీఎం అయితే కుమారుడు సీఎం కావాలా అని అడిగారు. ప్రతి కులంలో నాయకులు ఉంటారు.. పుడతారని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతనే సీఎంగా చేయాలనేది తమ పార్టీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తుఫాన్ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుల అరాచక పాలనపై విస్ఫోటనం ఎలా ఉంటుందో భవిష్యత్తులో ప్రజలే చూస్తారని అన్నారు.
దుష్ట పరిపాలనకు ఈ సందర్భంగా తాను సవాల్ విసురుతున్నానని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.ఓటు వేయడంతోనే ప్రజల బాధ్యత ముగిసిపోదని, అక్కడి నుంచే ప్రజాస్వామ్యంలో వారి అసలైన పాత్ర ప్రారంభమవుతుందని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినా నిలదీసి ప్రశ్నించాలని అన్నారు. అది తానైనా, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. 'పరివర్తన రాజనీతి పార్టీ' ద్వారా మరొక నాయకుడిని ఇవ్వడానికి తాను రాలేదని, యువతలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి వారిని నాయకులుగా మార్చడానికే వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో అహంకారపూరితమైన రెండు కుటుంబాల నాయకత్వానికి స్వస్తి పలకాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగుతుంది అని..యువతకే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు.



