సింహాచలం భూములపై విజిలెన్స్ విచారణ

ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ సాగుతున్న విషయం తెలిసిందే. అధికార, విపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహరంపై విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. ఈ తరుణంలో సర్కారు సింహాచల దేవస్థానం భూములు, మాన్సాస్ ట్రస్టు భూముల అవకతవకలపై విచారణ చేయించేందుకు విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ కు బాధ్యతలు అప్పగించింది. సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి అక్రమంగా తొలగించటం, మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాలకు సంబంధించి విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం దర్యాప్తు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి దేవస్థానం ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ అవకతవకలకు కారణమని ప్రాథమికంగా తేలటంతో సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు.
దేవాదాయశాఖలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రామచంద్రమోహన్ పై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ అంశం తీవ్రత దృష్ట్యా మరింతమంది పాత్ర ఈ అవకతవకల్లో బయటపడే అవకాశమున్నందున లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగం తో విచారణకు ఆదేశించారు. దేవాదాయశాఖలోని ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సు మేరకు విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ దర్యాప్తునకు ఆదేశించినట్టుగా తెలిపారు. మూడు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ అవకతవకలకు సంబంధించి విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగానికి సమాచారం ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారు. ప్రత్యేకించి మాన్సాస్ ట్రస్టులో పెద్దమొత్తంలో భూముల అవకతవకలు జరగటంతో నేరుగా విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ విభాగం ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయొచ్చని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.