వెంకట్రామిరెడ్డి కూడా వాళ్లతో కలిసేలా చేశారే?
మరి తప్పు ఎవరిది?
వెంకట్రామిరెడ్డి. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. పీఆర్సీ వివాదం ప్రారంభం అయినప్పటి నుంచి పలు సందర్బాల్లో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు. అసలు నివేదిక వచ్చాక..ప్రభుత్వ నిర్ణయం చూశాక స్పందిద్దాం..అప్పటివరకూ ఆగలేరా? అంటూ ఇతర సంఘాలపై విమర్శలు చేశారు ప్రారంభంలో. వీరు గతంలో ఎవరితో కలసి ఉన్నారో అందరికీ తెలుసు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ ప్రకటన వెలువడిన ఇతర సంఘాల నేతలతో పాటు వెంకట్రామిరెడ్డితో సహా అందరూ హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తో వెంకట్రామిరెడ్డి చాలా సరదగా కూడా మాట్లాడారు ఈ సందర్భంలో. కానీ పీఆర్సీ జీవోలు వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. అప్పటివరకూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వచ్చిన వెంకట్రామిరెడ్డి కూడా ప్రభుత్వ వైఖరి విషయంలో రివర్స్ గేర్ వేయాల్సి వచ్చింది. అంటే పీఆర్సీ ప్రకటన నాటి పరిస్థితి జీవోలు వచ్చే నాటికి లేదని తేటతెల్లం అయిపోతుంది. అంతే కాదు. ఎంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వారి ఆకాంక్షలు, ఆశలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్ళలేడు.
అందుకే తొలి నుంచి సర్కారుకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన వెంకట్రామిరెడ్డి కూడా జీవోలు జారీ అయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారంటే తప్పు సర్కారు వైపు ఉన్నట్లే అన్న సంకేతాలు వైసీపీ వర్గాలకు కూడా వెళ్ళాయి. ముఖ్యంగా హెచ్ ఆర్ ఏలో కోతతోపాటు పలు అంశాల విషయంలో ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తొలుత ఐఆర్ 27 శాతం ఇచ్చామని..పీఆర్సీ వల్ల ఏమైనా తేడా వచ్చిన ఉద్యోగుల నుంచి రికవరి ఉండదని చెప్పిన సర్కారు జీవోలో మాత్రం సీన్ మార్చింది. కారణం ఏదైనా ఉద్యోగుల నుంచి డబ్బు మీకు ఎక్కువ ఇచ్చాం వెనక్కి తీసుకుంటాం అనే సీన్ అసలు ఉండదు..అది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఏపీలో అది కూడా నెరవేరబోతుంది. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నిరసన కార్యక్రమాల్లో తానెప్పుడూ పాల్గొనలేదని..కానీ ఈ సారి మాత్రం మునిగినా తేలినా సరే అని రంగంలోకి దిగినట్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల కడుపు మండేలా అధికారులు పీఆర్సీ జీవోలు జారీ చేశారని ఆరోపించారు. అంతే కాదు.ఉద్యోగ సంఘాలను పూచికపుల్లగా భావించి వారు వ్యవహరించారని మండిపడ్డారు.