మాకు ఈ పదవులు వద్దు అంటూ ఎన్ఆర్ఐ మహిళా సభ్యుల రాజీనామాలు!

చంద్రబాబుకు లేఖ!
టీడీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కమిటీ, ఏపీ ఎన్ఆర్ టి నియామకాలు ఇప్పుడు తెలుగు దేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇది అంతా కూడా పార్టీ ప్రయోజనాల దృష్టిలో కాకుండా కొంత మంది వ్యక్తుల తమ ఇష్ఠానుసారం చేస్తున్నారు అని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ గా పీ. గురురాజా నియామకమే పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ నియామకం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ దే కీలక పాత్ర అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరో వైపు ఇప్పుడు ఏపీ ఎన్ఆర్ టి ప్రెసిడెంట్ వేమూరి రవి చేపట్టిన నియామకాల విషయంలో కూడా దుమారం మొదలైంది. ఇటీవల ఎన్ఆర్ టి తరపున పెద్ద ఎత్తున గ్లోబల్, రీజినల్ కో ఆర్డినేటర్స్ ను నియమించారు. నిబంధనల ప్రకారం ఏపీఎన్‌ఆర్‌టీఎస్ చట్టబద్ధంగా పూర్తిగా రాజకీయ రహిత సంస్థగా కొనసాగాల్సి ఉంటుంది. రాజకీయ ప్రచారం, పార్టీ ప్రమోషన్‌ను అది నిషేధిస్తుంది. అయినా కూడా టీడీపీ ఎన్ఆర్ ఐ మహిళా విభాగానికి చెందిన పది మందికి పైగా కోఆర్డినేటర్లుగా నియమించారు. అయితే ఈ పరిస్థితుల్లో తాము ఏపీ ఎన్ఆర్ టి కో ఆర్డినేటర్ల బాధ్యతలు చేపట్టలేము అంటూ అమెరికాకు చెందిన టీడీపీ ఎన్ఆర్ ఐ వింగ్ ప్రెసిడెంట్ శివాని జాగర్లమూడి కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నో సంవత్సరాలుగా మా పని, మా గుర్తింపు పూర్తిగా తెలుగు దేశం పార్టీతోనే ముడిపడి ఉంది అని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని మీరు చెప్పిన మాటల ప్రకారం మీరు అన్యాయంగా అరెస్టు చేయబడిన సమయంలో కాన్సులేట్ల వెలుపల నిలబడి నిరసన వ్యక్తం చేయడం, 2024లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, అన్న క్యాంటీన్ల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడం—ఇవన్నీ తెలుగు దేశం పార్టీ కోసమే చేశామని ఆమె తన లేఖలో ప్రస్తావించారు. ఎన్‌ఆర్‌ఐ ఉమెన్ వింగ్ స్థాపించిన నాటి నుంచి వందలాది మంది సభ్యులు ఎలాంటి పదవులు, హోదాలు లేదా వ్యక్తిగత ప్రశంసలను ఆశించకుండా తమ హృదయాలను, సమయాన్ని, చెక్కుచెదరని అంకితభావాన్ని ఈ పార్టీ కోసం ధారపోశారు అన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలన్న మా విజ్ఞప్తి గుర్తింపు లేదా హోదా కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మాతృభూమికి, పార్టీకి మరింత సమర్థవంతంగా సేవ చేయడానికి, మరింత బాధ్యతను చేపట్టేందుకు చేస్తున్న నిజాయితీతో కూడిన అభ్యర్థనగా వెల్లడించారు.
ఇటీవల ఏపీఎన్‌ఆర్‌టీఎస్ జారీ చేసిన “APNRTS Activities: Beyond Politics” పేరుతో ఉన్న సర్క్యులర్, ఎన్‌ఆర్‌ఐ ఉమెన్ వింగ్ స్థాపించబడిన నాటి నుంచి ఉన్న వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ చట్టబద్ధంగా పూర్తిగా రాజకీయ రహిత సంస్థగా కొనసాగాల్సి ఉంటుంది. రాజకీయ ప్రచారం, పార్టీ ప్రమోషన్‌ను అది నిషేధిస్తుంది. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను గౌరవిస్తూ, ఈ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కోఆర్డినేటర్ పదవుల నుంచి తప్పుకోవడం మినహా మా సభ్యులకు మరో మార్గం లేకుండా పోయింది. ఈ పదవులను వదులుకోవడం ద్వారా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ తన రాజకీయ రహిత విధానాన్ని కచ్చితంగా పాటించేలా చేయడమే కాకుండా, మా బృందం పూర్తి శక్తి, సమయం ఎప్పటినుంచో మేము పనిచేస్తున్న ప్రదేశమైన తెలుగు దేశం పార్టీలోనే కొనసాగేందుకు అవకాశం కలుగుతుంది.
ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీలో 40 మందికి పైగా సభ్యులు ఉండగా, వారిలో కేవలం 15 మంది మాత్రమే అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలో 12.3 లక్షలకు పైగా తెలుగువారు నివసిస్తున్నారు. ఇప్పటికే తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న, క్రమశిక్షణతో పనిచేసే ఎన్‌ఆర్‌ఐ ఉమెన్ వింగ్ వంటి బృందాన్ని సెంట్రల్ కమిటీలో చేర్చడం ద్వారా కమిటీ ప్రస్తుత బలానికి మరింత తోడ్పాటు లభిస్తుంది. ప్రాతినిధ్య లోటును పూడ్చడంతో పాటు, అమెరికాలోని తెలుగు ప్రవాస సమాజానికి, పార్టీ నాయకత్వానికి మధ్య శాశ్వతమైన, చురుకైన వారధిగా కూడా ఇది పనిచేస్తుంది అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఈ నియామకాల విషయంలోనే కాకుండా ఎన్ఆర్ టి వ్యవహారాల్లో కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతో వేమూరి రవి ఇష్టానుసారం చేస్తున్నారు అని టీడీపీ నేతలు చెపుతున్నారు. పీ. గురురాజా తో పాటు వేమూరి రవి ఇప్పుడు తెర వెనక పార్టీ వ్యవహారాల్లో కీలకం గా మారారు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు.



