Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 18 ఏళ్ళ వాళ్లకు వ్యాక్సిన్ జూన్ లోనే

ఏపీలో 18 ఏళ్ళ వాళ్లకు వ్యాక్సిన్ జూన్ లోనే
X

దేశ వ్యాప్తంగా మే 1 నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరింది. అయితే కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఏపీ సర్కారు మాత్రం మే 1 నుంచి 18 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో జూన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ఉంది. ఈ లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు.

కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని సింఘాల్ తెలిపారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సోమవారం నాడు 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 32,810 ఇంజక్షన్లు ఉన్నట్టు చెప్పారు. 4 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, ఈ వారంలో మరో 50 వేలు వస్తాయని సింఘాల్ తెలిపారు.

Next Story
Share it