ఇరకాటంలో చంద్రబాబు, నారా లోకేష్!

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. వైసీపీ హయాంలో సాగిన అక్రమాల విషయంలో కూటమి సర్కారు సరిగా చర్యలు తీసుకోవటం లేదు అనే విమర్శలు ఉన్న తరుణంలో ఇప్పుడు కూటమి సర్కారే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా వైజాగ్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన భూమి వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏటా వేల కోట్ల రూపాయల నికర లాభం గడించే టీసీఎస్ లాంటి కంపెనీ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమది ఏదో క్యాష్ రిచ్ స్టేట్ లాగా ఎకరా ఐదు పైసల కంటే తక్కువ ధరకే వైజాగ్ లోని హిల్ 3 లో మొత్తం 21.16 ఎకరాల భూమిని 99 పైసలకు కేటాయించింది. ఇదే టిసిఎస్ మార్చి 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 48553 కోట్ల రూపాయల నికర లాభాన్ని సాధించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి నెల గడవాలంటే అప్పు చేయాల్సిందే.
ఈ పరిస్థితి లో ఉండి కూడా టిసిఎస్ ఆగడగకపోయినా ప్రభుత్వం మాత్రం వందల కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయించి తాము వైజాగ్ కు టిసిఎస్ తీసుకొచ్చాం అనే ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ భూమి ధర విషయం తప్ప..ఇందులో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే టిసిఎస్ దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే టిసిఎస్ భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వైజాగ్ లోనే రెండు చోట్ల కలుపుకుని మొత్తం అరవై ఎకరాలు కేటాయించటానికి ఆమోదం తెలిపారు. ఇదే పెద్ద వివాదానికి కారణం అయింది. కేవలం రెండు నెలల ముందు ఇండియా లో నమోదు అయిన ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఈ కంపెనీకి వైజాగ్ లో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి కేటాయించడంపై పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు రావటంతో అటు ప్రభుత్వం, ఇటు టీడీపీ ఇరకాటంలో పడినట్లు అయింది.
ఈ మొత్తం వ్యవహారంలో టిసిఎస్ రాకతో వచ్చిన క్రెడిట్ కాస్తా ఉర్సా క్లస్టర్స్ ప్రతిపాదనతో ఉఫ్ అన్నట్లు అయింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ను ఇరకాటంలో పడేసే అంశమే అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై దుమారం సాగుతున్న వేళ టీడీపీ ఈ అంశంపై స్పదించింది. నిబంధనల ప్రకారమే ఉర్సా కి వైజాగ్ లో భూ కేటాయింపులు చేసినట్లు సమరించుకునే ప్రయత్నం చేసింది. రూ.5,728 కోట్లు పెట్టుబడితో, 2,500 ఉద్యోగాలు టార్గెట్ గా...రెండేళ్ళలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిబంధన ఉంది అని పేర్కొంది. అలా చేయని పక్షంలో, ప్రాజెక్ట్ రద్దు చేసి భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పుకొచ్చింది.
టీడీపీ ఎన్ని వివరణలు ఇచ్చినా ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదే వైజాగ్ లో లులూ మాల్ కూడా వేల కోట్ల రూపాయల భూముల కేటాయింపుపై తీవ్ర విమర్శలు ఉన్నా కూడా అది ఎక్కడి కంపెనీ..ఎన్ని సంవత్సరాలుగా ఉంది...అది ఏమి చేస్తుంది అన్నది ఎక్కువ మందికి తెలుసు. కానీ ఉర్సా క్లస్టర్స్ విషయంలో మాత్రం అలాంటిది ఏమి లేకుండా కేవలం అలా కంపెనీ రిజిస్టర్ చేయగానే ఇలా వైజాగ్ లో రెండు చోట్ల ..అది కూడా అరవై ఎకరాలు ఇవ్వటం అన్నది ఇప్పుడు ఈ వివాదానికి కారణం అయింది.