అప్పుడూ..ఇప్పుడూ నారా లోకేష్..విజయానంద్ లే!

కంపెనీ వెనక్కి వెళ్లిందా..ప్రభుత్వమే వెనక్కి తగ్గిందా!
హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడి విషయంలో ఉర్సా క్లస్టర్స్ కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందా?. ప్రభుత్వమే ఈ వివాదాస్పద ప్రాజెక్ట్ కు నుంచి వెనక్కి తగ్గిందా?. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు జీవో జారీచేయకపోవటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఐటి రంగంలో కానీ..డేటా సెంటర్స్ నిర్వహణలో ఏ మాత్రం అనుభవం లేని..కొత్తగా పుట్టుకొచ్చిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అతి తక్కువ ధరకు కేటాయించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇది జాతీయ స్థాయిలో కూడా దుమారం రేపింది. ఈ కంపెనీ ప్రమోటర్లకు ఐటి రంగంలో అనుభవం ఉంది కానీ...కేవలం రెండు నెలల క్రితం పెట్టిన కంపెనీకి వైజాగ్ లో ఏకంగా రెండు చోట్ల కలుపుకుని అరవై ఎకరాలు ఇవ్వటానికి ఏపీ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రుషికొండ హిల్ నంబర్ 3 లో 3 .5 ఎకరాలు...కాపులుప్పాడలో 56 . 5 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదించారు.
అయితే రుషికొండలో 3 . 5 ఎకరాలకు ఎకరా కోటి రూపాయల లెక్కన...కాపులుప్పాడ భూమిని ఎకరా 50 లక్షల రూపాయల లెక్కన కేటాయించాలని కోరినట్లు దీనిపై వివాదం తలెత్తినప్పుడు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. గత నెలలోనే చంద్రబాబు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో టిసిఎస్ కు , ఉర్సా క్లస్టర్స్ కు చెందిన భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని మీడియా బ్రీఫింగ్ లో కూడా చెప్పారు. టిసిఎస్ జీవో అయితే వచ్చింది కానీ..ఇన్ని రోజులు అయినా కూడా ఉర్సా క్లస్టర్స్ జీ ఓ విడుదల కాకపోవటంతో ఈ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల ప్రతిపాదన నుంచి విరమించుకుందా....లేక ప్రభుత్వం భూ కేటాయింపుల విషయంలో వెనక్కి తగ్గిందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే నారా లోకేష్ ఐటి శాఖ మంత్రి తన ఫస్ట్ టర్మ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తో కలిపి ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీని కూడా తెర మీదకు తెచ్చారు. ఈ రెండు సంస్థలకూ కలిపి అప్పటిలో 40 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి సిఎస్ దినేష్ కుమార్ ఈ సంస్థకు 40 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా..క్యాబినెట్ మాత్రం ఓకే చేసింది.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తో పాటు ఇన్నోవా సొల్యూషన్స్ కు కలిపి 40 ఎకరాలు ఇవ్వటానికి అప్పటి ఐటి శాఖ కార్యదర్శిగా ఉన్న కె. విజయానంద్ జీఓ జారీ చేశారు. రెండు కంపెనీలకు కలిపి ఒకే జీవో ఇవ్వటం కూడా అప్పటిలో పెద్ద దుమారం రేపింది. ఇన్నోవా సొల్యూషన్స్ విషయంలో వివాదం తలెత్తడంతో తొలుత రెండు కంపెనీలకు కలిపి ఇవ్వాలనుకున్న 40 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కే కేటాయిస్తూ మార్పులు చేశారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ తమకు కావాల్సింది 25 ఎకరాలు అని చెప్పింది. అయినా సరే రెండు దశల్లో ఈ సంస్థకు 40 ఎకరాలు కేటాయించాలని నిర్ణయిస్తూ అప్పటిలో ఉత్తర్వులు జారీ చేశారు. అంటే అప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఇన్నోవా సొల్యూషన్ వివాదం అప్పుడు ఐటి శాఖ లో ఉన్నది నారా లోకేష్, విజయానంద్ లే. అయితే ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ వివాదం సమయంలో కూడా వీళ్ళిద్దరే ఉండటం విశేషం. కాకపోతే విజయానంద్ ఇప్పుడు సిఎస్ గా ఉంటే...అప్పుడు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతే తేడా. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి.