జగన్ ది గ్యాంబ్లింగ్..ఎవరూ ఇలా చేయలేదు
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎండీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బిజినెస్ మెన్ అని..ఆయన ప్రభుత్వంలో కూడా అలాగే చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తనకు లాభం ఉంటుందని అంటేనే ఏ పని అయినా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకు వివిధ పథకాల కింద డబ్బులు ఇస్తున్నాను కాబట్టి వాళ్ళంతా తనకు ఓటు వేయాలన్దని జగన్ లెక్కగా ఉందన్నారు. అసలైన క్విడ్ ప్రో కో ఇదేనని వ్యాఖ్యానించారు. ఎంత కాలం జగన్ ఇలా ప్రజల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు వేయగలరో చూడాలన్నారు. జగన్ లా గ్యాంబ్లింగ్ ఎవరూ చేయలేదన్నారు. ఏపీ సర్కారు నిధుల మళ్ళింపుపై కేంద్రం విచారణ జరిగినా ఏమీ కాదని..తాను పేదల కోసమే ఇది అంతా ఖర్చు పెట్టానని చెప్పుకుంటారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుంది అని పదే పదే ప్రశ్నించిన జగన్ ..తాను అధికారంలోకి వచ్చాక కేంద్రానికి దీన్ని ఎందుకు అప్పగించలేదన్నారు. బిజెపి ఎపీలో తాము ఎలాగూ అధికారంలోకి రాలేము కాబట్టి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తోందని అన్నారు.
శుక్రవారం ఆయన వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ ఓ పక్క డబ్బులు ఇస్తూ.. మరో వైపు పన్నుల రూపంలో లాగేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌పై జగన్‌కి ముందు చూపు లేదని తప్పుబట్టారు. ఇంతకు ముందు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని తెలిపారు. తెలంగాణలో పవర్ కట్ లేదని, ఏపీలో కరెంట్ కట్ విపరీతంగా ఉందన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయటపడ్డానికి ఎన్ని యుగాలు పడుతుందోనని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్ చేస్తుంది తప్పని చెప్పేవాళ్లు లేరని, ఆయన ఎవరిమాట వినరని విమర్శించారు. ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లేదని తప్పుబట్టారు. ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు పసుపు కుంకుమ కింద 10 వేలు పంచినా ఓట్లు రాలేదన్నారు. డబ్బులు పంచుతున్నాను కదా? తనకే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారైందన్నారు. ప్రధాని మోదీకి జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా అంశం లేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు.