జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు, కెసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలవరం అంశానికి సంబంధించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో చేసిన చట్టానికి విలువ ఉందా లేదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చట్టంలో ఉన్నా ఇవ్వడం లేదని, ఆంధ్రప్రదేశ్ కాబట్టి చట్టం అమలు చేయటం లేదని అన్నారు. 'పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారో.. ఇవ్వరో కేంద్రంతో చెప్పించాలి' అన్నారు. 'పోలవరం పర్యటనకు రాకుండా రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారని, రైతులు వస్తే తప్పేంటి?' అని అడిగారు. పోలవరం ప్రాజెక్టు చూడకుండా సీఎం జగన్ ఆంక్షలు విధించటం అర్థం కావడం లేదన్నారు.
ఉండవల్లి మంగళవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రిజర్వాయర్ కట్టాలంటే పోలవరం తప్పితే వేరే మార్గం లేదని చెప్పారు. మిగతాచోట్ల కొండలున్నాయని, తాగునీటికి ఉపయోగించే ప్రాజెక్టులను అభ్యంతరం పెట్టాడానికి లేదన్నారు. అయితే ఆ క్లాజ్ ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలని చూస్తోందని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే.. జగన్ సర్కార్ ఆలోచనను ఉండవల్లి తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దని, అదే చేస్తే తర్వాత పోలవరాన్ని ఎవరూ పట్టించుకోరని అన్నారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని కేంద్రంతో పోరాడి సాధించుకోవాలని సూచించారు. రాజీపడితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినవారు అవుతారని ఉండవల్లి హెచ్చరించారు.
''తెలంగాణ వాడకపోతే మనకు నీళ్లు వస్తాయి. పన్నుల రేషియో మార్చారు కాబట్టే ప్రత్యేక హోదా లేదని.. 1-12-2015లోనే తేల్చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. పోలవరం విషయంలో కేంద్రంతో సంప్రదింపులపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలి. నిజాలు చెప్పకుండా జగన్ జనాల్ని మభ్యపెడుతున్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లేవు. తెలంగాణ ప్రాజెక్ట్ లకు అభ్యంతరం చెబితే జైల్లో పెడతానని కేసీఆర్ హెచ్చరించారు. పోలవరం పూర్తి అయ్యే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలి'' అని ఉండవల్లి సూచించారు.