అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారు

అయినా మాట్లాడే ధైర్యం లేదా?
ఏపీ నేతలు తీరు సిగ్గుచేటు..
అన్యాయం చేసిన వాళ్లే ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయినా సరే ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ పెట్టేందుకు అధికార వైసీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఆయన బుధవారం నాడు రాజ్యసభ వేదికగా ప్రధాని మోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజ్యసభ వేదికగా స్వయంగా మోడీ ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతుందని..దీనిపై చర్చించటానికి ఎవరికీ ధైర్యంలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వాన్ని దీనిపై అడిగానని...జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఇదే అంశంపై లేఖ రాసినట్లు వెల్లడించారు. అయినా స్పందన శూన్యం అన్నారు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటీషన్ పై ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయటానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. కనీసం మోడీ చేసిన వ్యాఖ్యలపై అయినా ధైర్యం చేసి చర్చకు నోటీసు ఇవ్వాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని నిలదీశారు. ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని ఉండవల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా మనవాళ్ళకు నొప్పిలేదన్నారు. రాష్ట్ర విభజనపై నరేంద్రమోదీ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
ప్రశ్నించే ప్రాంతీయ పార్టీల నేతలపై బీజేపీ కేసులు పెడుతోందని, రాబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని ఉండవల్లి అన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఇలా ఉంటే...వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఏమిటో తెలియడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆస్తుల పంపకానికి సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. స్వయంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇంకా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం పూర్తి కాలేదని చెపితే తెలంగాణ అందుకు ఒప్పుకోవటంలేదని..కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పటం దారుణమన్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశాలు కూడా ఏదో మొక్కుబడిగా సాగాయన్నారు. రేపు కేంద్రంలో ఎవరొచ్చినా అసలు ఏపీకి ఏమి ఇచ్చినా..ఇవ్వకపోయినా ఏమీకాదనే స్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఇక్కడ నేతలు అలా ఉన్నారని..దీని వల్ల భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు.