గేమ్ చేంజర్ ఈవెంట్ పై శ్రద్ద...తిరుమల ఏర్పాట్లపై ఏది?!
అందరూ కలిసి పనిచేయాల్సిన చోట వ్యవహారం ఎవరికీవారే అన్నట్లు సాగుతోంది. ఇదే తిరుమలలో వివిధ సమస్యలకు కారణం అవుతోంది. భక్తజనం అంతా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం రెడీ అవుతున్న తరుణంలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకోవటం ఒక్కసారి గా అందరిలో కలకలం రేపింది. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల క్యూ లో ఆరుగురు మృతువాత పడటం అందరిని షాక్ కు గురి చేసింది. అత్యంత కీలక సమయంలో అందరూ సమన్వయంతో సాగాల్సిన వేళ టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి లు ఎవరికీ వారే అన్న చందంగా వ్యవహరించటం కూడా తాజా పరిస్థితికి కారణం అవుతోంది అని చెపుతున్నారు.
ఒక వైపు చైర్మన్ బిఆర్ నాయుడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది అని...అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు మీడియా సాక్షిగా ప్రకటించారు. ఐదు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా కూడా దురదృష్టకర ఘటన జరిగింది అని అయన మీడియా ముందే చెప్పిన సంగతి తెలిసిందే. చైర్మన్ తో పాటు ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ల మధ్య అసలు ఏ మాత్రం సమన్వయం లేదు అని టీటీడీ వర్గాలు చెపుతున్నాయి.
మరో వైపు ప్రతి సారి పాత చంద్రబాబు ను చూస్తారు పాత చంద్రబాబును చూస్తారు అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇంతటి దారుణ వైఫల్యం తర్వాత తిరుపతి కలెక్టర్ పై చర్యలు తీసుకోకుండా ఉండటం సరి కాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీటీడీ అధికారులతో కలిసి పని చేయాల్సిన ఆయన కూడా ఇవేమి పట్టించుకున్నట్లు లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇటీవల రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు ఏకంగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా అధికారులు ముందుగా వేదికగా దగ్గరకు పోయి అన్ని ఏర్పాట్లు పరిశీలించి వచ్చారు. కానీ ప్రతి ఏటా తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు అని చెపుతున్నారు.
గేమ్ చేంజర్ సినిమా విషయంలో చూపిన శ్రద్ధలో కొంత అయినా తిరుమల వైకుంఠ దర్శన ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. మరో వైపు టీటీడీ ఈఓ, అదనపు ఈఓ ల మధ్య ఏ మాత్రం సయోధ్య లేదు అని..అదనపు ఈఓ పాలకమండలి సభ్యుల నుంచి వచ్చే ఫోన్లకు కూడా స్పందించకుండా పీఏ తోనే మీటింగ్ లో ఉన్నట్లు సమాధానాలు చెప్పిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ఈ విషయంలో సరిగా వ్యవహరించలేదు అని చెపుతున్నారు.