సంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టీటీడీ
గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమం కూడా తీవ్ర విమర్శల పాలైంది. భక్తులకు తిరుమలలో విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉచితంగానే భోజనం పెడతారు. అయితే కొత్తగా డబ్బులు తీసుకుని సంప్రదాయ భోజనం అంటూ కొత్త కార్యక్రమం తెరపైకి తెచ్చారు.దీనిపై విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
''పాలక మండలి లేనప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా భోజనం అందించాలి. అన్నప్రసాదానికి భక్తుల నుంచి నగదు తీసుకోకూడదు. సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నాం. సర్వదర్శనం అమలుపై అధికారులతో చర్చిస్తాం. అధికారుల హామీ మేరకు వీలైనంత మందికి ఉచిత దర్శనం కల్పిస్తాం'' అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉచిత దర్శనంపై నిషేధం కొనసాగిస్తున్నామన్నారు..