Telugu Gateway
Andhra Pradesh

ఏపీ స‌ర్కారుకు ట్రెజ‌రీ ఉద్యోగుల షాక్

ఏపీ స‌ర్కారుకు ట్రెజ‌రీ ఉద్యోగుల షాక్
X

ఏపీలో పీఆర్సీ వ్య‌వ‌హారం ముదురుతోంది. కొత్త పీఆర్సీ ప్ర‌కారం వేత‌నాల బిల్లులు సిద్ధం చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ట్రెజ‌రీ శాఖ‌ను ఆదేశించింది. అయితే అందుకు ట్రెజ‌రీ ఉద్యోగులు స‌సేమిరా అంటున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగ‌మేన‌ని..త‌మ‌పై ఈ విష‌యంలో ఒత్తిడి తేవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అంతే కాదు..నూత‌న పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ట్రెజ‌రీ ఉద్యోగుల త‌ర‌పున ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుడ‌ల చేశారు. దీంతో స‌ర్కారు ఒకింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో చిక్కుకున్న‌ట్లు అయింది. ట్రెజ‌రీ విభాగం అనేది ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌క‌మైనది. ఏ బిల్లు అయినా వీరి ఆమోదంతోనే ముందుకు సాగాల్సి ఉంటుంది. వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ట్రెజరీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా నిరసిస్తోంది.

ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేంటో చెప్పారలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పెండింగ్‌ డీఏలు మంజూరు చేసి.. జీతం పెరిగినట్లు చూపిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘం అభ్యంతరం తెలుపుతోంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులో కోత విధించడం అన్యాయమని ట్రెజరీ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. పలు జిల్లాల్లో వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేయలేదు. ఈనెల 25లోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించింది. అయితే ట్రెజరీ ఉద్యోగులు, డ్రాయింగ్ అధికారులు అందుకు నిరాకరించారు. మ‌రి ప్ర‌భుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it