Telugu Gateway
Andhra Pradesh

ఏపీకి సినీ ప‌రిశ్ర‌మ‌..ఇక మ‌ర్చిపోవ‌ట‌మే!

ఏపీకి సినీ ప‌రిశ్ర‌మ‌..ఇక మ‌ర్చిపోవ‌ట‌మే!
X

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు సినీ ప‌రిశ్ర‌మ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూసి చాలా మంది అవాక్కు అవుతున్నారు. అదేదో ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయ పార్టీతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లే సినీ ప‌రిశ్ర‌మ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఓ ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఓ సారి అమ‌రావ‌తి వెళ్లి ఆయ‌న్ను క‌లిసి వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ వీరికి చాలా హామీలు ఇచ్చారు. హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చేవారికి ప‌రిశ్ర‌మ అవ‌స‌రాల‌తో పాటు నివాసాల‌కు కూడా స్థ‌లాలు కేటాయిస్తామ‌న్నారు. ఆ త‌ర్వాత ఈ దిశ‌గా పెద్ద‌గా అడుగులు ప‌డింది ఏమీలేదు. ఎవ‌రూ ఈ అంశాన్ని ప‌ట్టించుకోలేదు. కానీ గ‌త కొంత కాలంగా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు వ్య‌వ‌హారం పెద్ద వివాదంగా మారింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల ఎగ్జిబిట‌ర్లు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతార‌ని..ఆ రేట్ల‌కు థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులే స‌రిపోవ‌ని కొంత మంది ప్ర‌భుత్వానికి నివేదించారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్ లు ఇదే అంశంపై బ‌హిరంగ వేదిక‌ల నుంచి కూడా స్పందించారు. ఆ త‌ర్వాత హీరో నాని కూడా ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ విష‌యంలో సానుకూలంగా స్పందించాలంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ పై ఏపీ మంత్రి పేర్ని నాని సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి చిరంజీవి వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ‌తాన‌న్నారు. కానీ జ‌రిగింది శూన్యం. కొంత మంది ఎగ్జిబిట‌ర్లు రేట్ల తగ్గింపు అంశంపై హైకోర్టుకు వెళితే..డివిజ‌న్ బెంచ్ ఇచ్చిన తీర్పులు రేట్ల పెంపు అంశాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ల అనుమ‌తితో చేసుకోవాల‌ని చెప్పింది.

అయితే ఏపీ హోం శాఖ కార్య‌ద‌ర్శి మాత్రం దీనిపై స్పందిస్తూ జీవో 35 అమ‌ల్లోనే ఉంద‌ని..డివిజ‌న్ బెంచ్ ఆదేశాలు ఎవ‌రైతే కోర్టుకు వెళ్ళారో వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. హైకోర్టు ఓ అంశంపై తీర్పు ఇవ్వ‌గా...ఎవ‌రైతే కోర్టుకు వెళ్ళారో వారికి మాత్ర‌మే ఈ తీర్పు వ‌ర్తిస్తుంద‌ని సూత్రీక‌రించారు. అంటే ఈ విష‌యంలో మిగిలిన వారికి ఇదే రేట్లు వ‌ర్తించ‌టానికి కొంత ఆల‌శ్యం కావొచ్చేమో కానీ..అదే నిబంధ‌న మిగిలిన వారికి కూడా వ‌ర్తిస్తుంది. కానీ ప్ర‌భుత్వం థియేట‌ర్ల విష‌యంలో ఎందుకింత క‌ఠిన వైఖ‌రి అవ‌లంభిస్తుంది అన్న‌దే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మారిన ఈ ప‌రిస్థితుల్లో ఏపీకి సినీ ప‌రిశ్ర‌మ పోవ‌టం అన్న‌ది క‌ల‌లో కూడా జ‌రిగే అంశం కాద‌ని ఓ ప్ర‌ముఖుడు వ్యాఖ్యానించారు. అదే స‌మయంలో తెలంగాణ స‌ర్కారు మాత్రం ప్రేక్షకుల‌పై ఎంత భారం ప‌డుతుంది అనే అంశంతో సంబంధం లేకుండా రేట్లు ఎడాపెడా పెంచుకోవ‌టానికి అనుమ‌తిస్తోంది. అంతే కాదు..అడిగిందే త‌డ‌వుగా ఐదు షోలకు కూడా అనుమ‌తించి..ఏపీ స‌ర్కారు తీరును సద్వినియోగం చేసుకుంటోంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యలో ఇక్క‌డ ఉన్న మౌలిక‌స‌దుపాయాలు కూడా ఓ సానుకూల అంశంగా ఉంది. సినీ ప‌రిశ్ర‌మ కోరిన డిమాండ్లు అన్నీ తీర్చాల్సిన అవ‌స‌రం లేద‌ని..కానీ వారితో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం ఖ‌చ్చితంగా తేడాగా ఉంద‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it