Telugu Gateway
Andhra Pradesh

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?!

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?!
X

తిరుపతి లడ్డూ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మ రక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది. సోమవారం నాడు సుప్రీం కోర్టు లో ఈ కేసు విచారణ సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అటు ముఖ్యమంతి చంద్రబాబు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టాయి. అదే సమయంలో ఈ అంశంపై మీ క్లయింట్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోండి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ/టీటీడీ న్యాయవాదులకు కూడా సుప్రీం కోర్టు సూచించింది. ఈ తరుణంలో మంగళవారం నాడు టీడీపీ అధికారిక పేస్ బుక్ పేజీ లో పెట్టిన పోస్ట్ చూస్తేనే పరిస్థితి అర్ధం అవుతుంది. ఆ పోస్ట్ సారాంశం ఇలా ఉంది.

‘తిరుమల లడ్డూ అంటే కోట్లాది భక్తులకు ఒక సెంటిమెంటు. అటువంటి లడ్డూ విషయంలో అపచారం జరిగితే దాచి ఉంచడం మహా పాపం. స్వయంగా శ్రీవారి భక్తుడు కాబట్టి చంద్రబాబు ఆవేదనతో ఈ విషయాన్ని బయటపెట్టారు తప్ప వైసీపీ వాళ్ళు అంటున్నట్టు రాజకీయం కోసం కాదు.’ అంటూ పేర్కొన్నారు. దీంతో పాటు ఒక ఫోటో ను కూడా జత చేస్తూ నెయ్యి లో కల్తీ జరిగింది అని ఎన్ డీడీబి ల్యాబ్ తేల్చింది. దానికి ముందే నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీలో వాడటం జరిగింది. అంటే లడ్డూ విషయంలో అపచారం జరిగింది. నిజాయితీగల ముఖ్యమంత్రి కాబట్టే వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు అంటూ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో !

సమాధానం లేని ప్రశ్నలు?!

#కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇంతటి దారుణ విషయం తెలిస్తే తొలుత టీటీడీ దీనిపై వెంటనే కేసు పెట్టాలి. ఆ పని ఎందుకు చేయలేదు?

#ఇందుకు బాద్యులైన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్లపై చర్యలకు ఉపక్రమించాలి.

#కల్తీ నెయ్యి సరఫరాదారు పై కేసు నమోదు చేయాలి.

#ఈ టెండర్ ను ఓకే చేసిన వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టాలి.

#కానీ ఇవేమి చేయకుండా కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో కూడిన విషయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బహిరంగంగా తిరుమల లడ్డూ లో జంతువులు కొవ్వు కలిసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

#కల్తీ నెయ్యి విషయంలో అటు టీటీడీ మొన్న మొన్నటి వరకు ఎందుకు కేసు పెట్టలేదు?

#విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తొలుత ఈ విషయంలో కేసు పెట్టాలని చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఎందుకు ఆదేశించలేదు?

# టీటీడీ కేసు పెట్టిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు.

#కానీ కల్తీ నెయ్యి సరఫరాదారు..ఇందుకు బాద్యులైన వాళ్లపై లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన తర్వాత కానీ కేసు పెట్టలేదు.

#చంద్రబాబు..తెలుగు దేశం పార్టీ అధికారికంగా చెపుతున్న లడ్డూ లో కల్తీ నెయ్యి వాడకం జరిగింది అనటానికి పక్కా ఆధారాలు ఉంటే సుప్రీం కోర్టు లో ఎందుకు గట్టిగా కేసు ప్రెజంట్ చేయలేకపోయారు అన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

Next Story
Share it