Telugu Gateway
Andhra Pradesh

సుప్రీం కోర్టు ముందు ఏమి చెపుతుంది?

సుప్రీం కోర్టు ముందు ఏమి చెపుతుంది?
X

దేశ వ్యాప్తంగా దుమారం రేపిన తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్ట్ ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకోబోతోంది?. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వాదన వైపు నిలుస్తుందా?..లేక నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ ధర్మాసనానికే వదిలేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం సిట్ విచారణకు ఓకే అని చెప్పే సాహసం చేయకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో కేంద్రం సేఫ్ గేమ్ ఆడుతుంది అని...ఎలాంటి స్టాండ్ చెప్పకుండా సుప్రీం కోర్టు ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అనే స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు సిట్ విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగానే చెపుతున్నారు. ఇప్పటికి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగింది అనే వాదనకు కట్టుబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు ఛాన్స్ లేకుండా సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తమకూ సమ్మతమే అని ప్రకటించి...అందులో భాగంగానే ఇప్పటికి సిట్ విచారణ ను కూడా నిలిపివేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే.

తిరుమల లడ్డూ వ్యవహారం గురువారం నాడు అంటే అక్టోబర్ మూడున విచారణకు రానున్న విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ లో వాడిన నెయ్యి కల్తీ జరిగింది అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయటం ..ఇది దేశ వ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసింది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ కీలక నేతలు కూడా ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ..ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రం స్టాండ్ ఈ విషయంలో ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అటు కేంద్రం తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వామిగా ఉన్నందున తనంతట తాను సిబిఐ లేదా...ఇతర విచారణలు మొగ్గుచూపకపోవచ్చు అని భావిస్తున్నారు. చూడాలి మరి గురువారం సుప్రీం కోర్టు లో ఏమీ జరుగుతుందో వేచిచూడాలి.

Next Story
Share it