ప్రస్తుతానికి అంతే!

వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా సీఎం జగన్ వైజాగ్ నుంచే పాలన సాగిస్తారు..న్యాయపరమైన అవరోధాలు అన్ని అధిగమించి తాము అనుకున్నట్లు విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది అని మంత్రులు, వైసీపీ నేతలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రకటిస్తూ వచ్చారు. కానీ అది ఇప్పటిలో సాధ్యం అయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించటం లేదు. ఎందుకంటే రాజధానికి సంబంధించిన పలు కేసు లు సుప్రీం కోర్టులో ఉన్నాయి. వీటిపై విచారణ కూడా డిసెంబర్ లో మాత్రమే సాధ్యం అవుతుంది అని కోర్టు తేల్చి చెప్పింది. అంటే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. దీంతో ఈ సారికి వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ కు, ఉత్తరాంధ్రకు ఇచ్చేది...ఇవ్వగలిగేది ఒక్క సీఎం క్యాంపు ఆఫీస్ మాత్రమే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ బాద్యుడు, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి తాజాగా మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్ తన క్యాంపు ఆఫీస్ ను ఆగష్టు లేదా సెప్టెంబర్ లో వైజాగ్ కు షిఫ్ట్ చేస్తారు అని ప్రకటించారు. సీఎం జగన్ కూడా పలు మార్లు తాను వైజాగ్ కు షిఫ్ట్ అవుతాను అని వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తనకు నచ్చిన చోట కూర్చుని సీఎం పాలన సాగించవచ్చు. కానీ ముందు చెప్పినట్లు వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలంటే మాత్రం సుప్రీం కోర్టు లో కేసు తేలే వరకు ఏమీ కాదు అనే విషయం తెలిసిందే. ఈ కేసు లో తీర్పు రావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది వచ్చే ఏడాది వరకు పట్టవచ్చు అని..ఈ లోగా ఎన్నికలు కూడా వస్తాయని అధికారులు చెపుతున్నారు. దీంతో సీఎం జగన్ అటు ముందు అంగీకరించిన రాజధాని అమరావతి లేకుండా చేసి...తాను ప్రతిపాదించిన మూడు రాజధానులు కూడా అడుగు ముందుకు పడకుండా ఐదేళ్ల పాలన పూర్తి చేసుకునేలా ఉన్నారనే చర్చ సాగుతోంది.