సమగ్రంగా..స్పష్టంగా మళ్ళీ బిల్లులు తెస్తాం
మూడు రాజధానుల అంశంపై ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే సమగ్రంగా..స్పష్టంగా మళ్ళీ బిల్లులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..'హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దు అని ప్రజల తీర్పు అనేక మార్లు స్పష్టం చేసింది. వికేంద్రీకరణే సరైన అడుగు అని ముందడుగు వేశాం. అన్ని కులాలు, మతాలు, ప్రజలు ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాం. ప్రజల మద్దతు ఉన్నందునే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు మనసారా దీవించారు. మూడు బిల్లులు ఆమోదం పొందిన వెంటనే అమల్లోకి వచ్చి ఉంటే ఆ ఫలితాలు ఇప్పటికే వచ్చి ఉండేవి. అపోహలు, న్యాయపరమైన చిక్కులు..కేసులు, కొంత మందికి అన్యాయం జరుగుతుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రాంతంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది.
బిల్లును మరింత మెరుగుపర్చేందుకు...అన్ని చట్టపరమైన, న్యాయపరమైన అంశాలు పొందుపర్చేందుకు..అవసరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఇంతకు ముందు పెట్టిన బిల్లులు వెనక్కి తీసుకుని..మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్త్రత, విశాల ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ' అని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖపట్నం అని.. ఇవాళ కాకపోయినా పదేళ్ళకు అయినా బాగా డెవలప్ అవుతుందన్నారు. ఎప్పటికీ మన పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిందేనా అని జగన్ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో కేవలం మౌలికసదుపాయాల కల్పనకే ల క్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అంత డబ్బు ఒకే చోట పెట్టడం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఇంతకు ముందుచెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చట్టపరమైన, న్యాయపరమైన సమాధానాలు కూడా బిల్లులోనే పొందుపరుస్తామని వెల్లడించారు.