Telugu Gateway
Andhra Pradesh

అప్పట్లో పాక్ లో..ఇప్పుడు ఏపీలో

అప్పట్లో పాక్ లో..ఇప్పుడు ఏపీలో
X

ఏపీలో వరసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనలు జరిగేవని చదువుకునేవారమని..ఇప్పుడు ఏపీలో అలా జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీ దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరమన్నారు. 'హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకొందని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. పాకిస్థాన్ లో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం. రామ కోటి సభక్తికంగా రాసే నేల ఇది... రామాలయం లేని ఊరంటూ కనిపించదు మన దేశంలో. రాముణ్ణి ఆదర్శంగా తీసుకొంటూ ఉంటాం. మన రాష్ట్రంలో ఆ భావనలు చెరిపేయాలనుకొంటున్నారా? భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకొన్న రామతీర్థం క్షేత్రంలో కొద్ది రోజుల కిందటే కోదండరాములవారి విగ్రహం తలను నరికి పడేసే మత మౌఢ్యం పెచ్చరిల్లడం ఆందోళనకరం.

ఈ బాధ భక్తుల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు దేవ గణాలకు సేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం చేతులను నరికేయడంచూస్తే ధ్వంస రచన పరాకాష్టకు చేరుతున్నట్లు అనిపిస్తోంది. రామతీర్థం క్షేత్రంలో కోదండ రాముని విగ్రహాన్ని పగలగొట్టడం.. అంతకు ముందు పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదు. రామతీర్థం క్షేత్రంలో శ్రీ కోదండరాముల వారి విగ్రహం తలను నరికిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన ఉదాసీనంగా ఉంది. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ చెప్పడం చూస్తే ఈ వరుస దాడులపై ఆయన ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు నేరం చేసేవారిని నిలువరించవు సరికదా... మరో దుశ్చర్యకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఈ ఘటనలకు ఇతర పక్షాలే కారణం అంటూ అధికార పక్షంవాళ్లు చెబుతున్నారు. మరి వారి చేతుల్లోనే పోలీసు, నిఘా విభాగాలు ఉంటాయి కదా... బాధ్యులను ఇప్పటి వరకూ ఎందుకు గుర్తించి అరెస్టు చేయడం లేదు.

దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా... అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులుపెట్టిన ప్రభుత్వం - హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తుంది. విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలి. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలి. అప్పుడే మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయి.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it