Telugu Gateway
Andhra Pradesh

ఏపీ టెన్త్ విద్యార్ధులు అలా చదువుతూ ఉండాల్సిందేనా?

ఏపీ టెన్త్ విద్యార్ధులు అలా చదువుతూ ఉండాల్సిందేనా?
X

ఏపీ సర్కారు పదవ తరగతి పరీక్షలను అలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతుంది. కరోనా కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణలో అయితే ఇప్పటికే ఏకంగా ఫలితాలు కూడా ప్రకటించేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. కానీ ఏపీ సర్కారు మాత్రం పరీక్షల విషయంలో మాత్రం పట్టుదలతో ఉంది. అసలు కరోనా ఎప్పుడు తగ్గుతుందో..తగ్గినా లక్షలాది మంది విద్యార్ధులకు పరీక్షల నిర్వహణకు అనువైన వాతావరణం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ జులైలో పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. అంటే విద్యార్ధులు అలా ఈ కరోనా ఒత్తిడిలో చదువుతూనే ఉండాలి. పోనీ గ్యారంటీగా పరీక్షలు జరుగుతాయా అంటే అదీ క్లారిటీలేదు.

ఈ పరిస్థితుల వల్ల పిల్లలపై మరింత ఒత్తిడి పడే ప్రమాదం ఉందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు ఏపీలో పదవ తరగతి పరీక్షల అంశం మరోసారి హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలోనే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సర్కారు తెలిపింది. ముందు అనుకున్న దాని ప్రకారం అయితే జూన్ 7 నుంచి ఇవి ప్రారంభం కావాల్సి ఉంది. పరీక్షలు వాయిదా వేయటంతోపాటు ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. ఈ అంశంపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని హైకోర్టు కోరింది. ఈ అంశంపై తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా పడింది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే నిర్వహణ తప్పనిసరి అవుతుంది కానీ పలు రాష్ట్రాలు మాత్రం పదవ తరగతి పరీక్షలను నిర్వహించకుండానే పాస్ చేశాయి.

Next Story
Share it