Telugu Gateway
Andhra Pradesh

వై నాట్ 175 అన్నవైసీపీ ..వాస్తవాలు గ్రహించిందా!

వై నాట్ 175 అన్నవైసీపీ ..వాస్తవాలు గ్రహించిందా!
X

సజ్జల సైడ్ ఎందుకయ్యారు...బొత్స ముందుకు ఎందుకువచ్చారు. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ లో హాట్ టాపిక్. పదకొండు నియోజకవర్గాల్లో ఇంచార్జి లను మారుస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పార్టీ కి సంబంధించిన ఏ అంశంపై కూడా జగన్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఓన్లీ ఇండోర్ మీటింగ్స్ మాత్రమే. వైసీపీ లో ప్రభుత్వ వ్యవహారం అయినా...పార్టీ వ్యవహారం అయినా అంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నడిపిస్తారు. పార్టీ కి సంబంధించిన ఏ విషయంపై అయినా సరే చివరకు మంత్రులు కూడా నేరుగా జగన్ కు చెప్పే పరిస్థితి ఉండదు అని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ముందు సజ్జలకు చెప్పాలి...అవసరం అయితేనే అది జగన్ దగ్గరకు వెళుతుంది తప్ప...లేకపోతే సజ్జల.. లేదంటే కొంత మంది సీఎంఓ అధికారుల వద్దకు వెళుతుంది అని మంత్రులు కూడా వాపోతున్నారు. దీంతో చాలా మంది నేతలు తమకు ఉన్న సమస్యల విషయాన్ని కూడా చెప్పటం మానేశారు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. ఈ తరుణంలో పదకొండు మంది ఇంచార్జి ల మార్పు విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకుండా...ముందు మంత్రి బొత్స సత్యనారాయణతో చెప్పించారు. తర్వాత సజ్జల ఏదో వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.

గతంలో ఇదే సజ్జల ప్రభుత్వానికి చెందిన కీలక విషయాలను కూడా మంత్రులను పక్కన పెట్టుకుని మరీ ఆయనే చెప్పిన సందర్భాలు ఎన్నో . కానీ ఈ సారి అందుకు బిన్నంగా ఎందుకు చేశారు....సజ్జలపై పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే మార్పుకు సంబంధించిన తిట్లు అన్నీ బొత్స కు వెళతాయని ఈ పని చేశారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు చేసిన పదకొండు నియోజకవర్గాల మార్పులే కాదు...రాబోయే రోజుల్లో మరిన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు ఉంటాయని వైసీపీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు వై నాట్ 175 అంటూ ప్రకటనలు చేసిన నేతలు ఇప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టారు అంటే పరిస్థితులు పార్టీ కి అనుకూలంగా లేవు అని అంగీకరిస్తున్నట్లు అయింది అనే చర్చ కూడా వైసీపీ నేతల్లో సాగుతోంది. ఇప్పుడు ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో తక్కువలో తక్కువ 45 నుంచి 50 మంది సీట్లు మారుస్తారు అని ఆ పార్టీ నాయకుల్లో ప్రచారం ఉంది. అంటే ఈ మార్పు లేకపోతే ప్రజలే అక్కడ ఎమ్మెల్యేలను మారుస్తారు అనే భయం వైసీపీ లో ఉంది అనే సంకేతాలు ప్రజలకు పంపినట్లు అయింది అని చెపుతున్నారు.అయితే ఈ మార్పులు పార్టీకి మంచి చేస్తాయా..లేక నష్టం చేస్తాయా అన్నది ఫలితాల తర్వాత కానీ తేలదు. ఈ పదకొండు మార్పులకే పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల నాటికీ ప్రచారంలో ఉన్నట్లు మరిన్ని మార్పులు జరిగితే పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

Next Story
Share it