Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళ‌న‌కారులు

ఏపీలో మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళ‌న‌కారులు
X

కోన‌సీమ జిల్లా పేరుమార్పు ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. మంగ‌ళ‌వారం నాడు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆందోళ‌న‌కారులు భారీ ఎత్తున దాడుల‌కు దిగారు. ఏకంగా పోలీసుల‌పై దాడి చేయ‌టంతో పాటు ప్రైవేట్, ఆర్టీసీ బ‌స్సుల‌ను ధ్వంసం చేయారు. దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల నెల‌కొన్నాయి. పోలీసులు 144 సెక్షన్‌ విధించినా కూడా ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోయారు. ఆందోళ‌న‌కారుల దాడిలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డికి, పోలీసు అధికారుల‌కు గాయాలు అయ్యాయి. ఏకంగా మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి ఇల్లు మంట‌ల్లో కాలిపోయింది. మంత్రి ఇంటితోపాటు క్యాంప్ ఆఫీసులోని ఫ‌ర్నీచ‌ర్ ను, కార్ల‌ను దుండ‌గులు త‌గ‌ల‌బెట్టారు. ఇంటికి నిప్పు పెట్టిన స‌మ‌యంలో మంత్రి విశ్వ‌రూప్ త‌న నివాసంలో ఉన్నారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి కార్ల‌లో అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఆందోళ‌నకారుల‌ను నిలువ‌రించేందుకు పోలీసుల గాల్లోకి కాల్పులు జ‌రుపుతున్నారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో అమలాపురం పట్టణం రణరంగంగా మారింది.

కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. వాటిని పట్టించుకోలేదు. దీంతో అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై ఏపీ హోం మంత్రి తానేటి వ‌నిత స్పందించారు. అంబేద్క‌ర్ పేరును వ్య‌తిరేకించ‌టం స‌రికాద‌ని..తొలుత అంద‌రూ ఈ పేరుకు అంగీక‌రించి ఇప్పుడు రాజ‌కీయం చేయ‌టం స‌రికాద‌ని అన్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. కోన‌సీమ జిల్లా పేరు మార్పు విష‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కిపోద‌ని తెలిపారు. ప్ర‌జ‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. ఈ దిశ‌గా పార్టీలు కూడా ప్ర‌జ‌ల‌ను కోరాల‌న్నారు.

Next Story
Share it