ముడుపులు ఇచ్చినట్లు చెప్పిన కంపెనీకి అందలం

అమరావతిలో జరుగుతున్న గోల్ మాల్ అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు పనులు కాంట్రాక్టు సంస్థలకు కేటాయిస్తున్నా ఇందులో ఏ మాత్రం పారదర్శకత లేక పోగా...మొత్తం అంటే మొత్తంగా ఫిక్సింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేకపోతే అమరావతిలో సచివాలయానికి చెందిన ఐకానిక్ టవర్లు ఏడేళ్ల క్రితం ఏ కంపెనీలు దక్కించుకున్నాయో..ఇప్పుడు కూడా అవే కంపెనీలకు అవే టెండర్లు ఎలా దక్కుతాయి. మరీ విచిత్రం ఏమిటి అంటే కనీసం టవర్ల నంబర్లు కూడా మారకపోవడంతో ఇది ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహరమో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఐకానిక్ టవర్ల పనులను 2018 అక్టోబర్ లో షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి, ఎన్ సిసి లకు దక్కినట్లు అప్పటిలో సిఆర్ డీఏ అధికారులు ప్రకటించారు. అప్పుడు కూడా అంటే 2018 లో కూడా షాపూర్జీ పల్లోంజీ 1 , 2 టవర్లు, ఎల్ అండ్ టి 3 , 4 టవర్ల పనులు దక్కించుకునే ఐదవ టవర్ పనులు ఎన్ సిసి దక్కించుకుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 2025 జూన్ లో కూడా షాపూర్జీ పల్లోంజీకి 1 , 2 టవర్లు, ఎల్ అండ్ టి 3 , 4 టవర్ల పనులు దక్కించుకుంటే ఐదవ టవర్ పనులు ఎన్ సిసి దక్కించుకుంది అంటే వీటిని పోటీ టెండర్లు అంటారా ...మ్యాచ్ ఫిక్సింగ్ టెండర్లు అంటారా అన్న చర్చ తెర మీదకు వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇతర కంపెనీలు ఏమీ రాకుండా తాము అనుకున్నట్లు ఈ కంపెనీలకు మాత్రమే పనులు దక్కేలా స్కెచ్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ మూడు సంస్థలు ఇప్పటికే అమరావతిలో వేల కోట్ల రూపాయల విలువైన ఇతర పనులు కూడా దక్కించుకున్నాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఇదే షాపూర్జీ పల్లోంజీ సంస్థ తాత్కాలిక సచివాలయం పనులు కూడా చేసింది. అంతే కాదు ఈ పనులు దక్కించుకున్నందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు కంపెనీ 118 కోట్ల రూపాయల మేర ముడుపులు ఇచ్చినట్లు గతంలో షాపూర్జీ ప్రతినిధి ఒకరు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. గతంలో ఐటి శాఖ చంద్రబాబు కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసు అలా ఉండగానే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఐకానిక్ టవర్ల తో పాటు అమరావతి లో ఇతర పనులను కూడా షాపూర్జీ పల్లోంజీ కి కేటాయించడంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బరితెగింపు తప్ప మరొకటి కాదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. మరో వైపు అమరావతి ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారు అనే విమర్శలు ఉంటే ఈ పనులు దక్కించుకున్న సంస్థలు అన్నీ కూడా ఈ పనులకు ఎక్సెస్ కోట్ చేయటం మరో విశేషం. అంతా ముందస్తుగా అనుకుని పని కానిచ్చేసుకున్నారు అని ఈ వ్యవహారం చూస్తుంటే క్లియర్ గా అర్ధం అవుతుంది అని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు.