Telugu Gateway
Andhra Pradesh

మరో సారి టీడీపీ, బీజేపీ కలుస్తాయా?!

మరో సారి టీడీపీ, బీజేపీ కలుస్తాయా?!
X

ఢిల్లీ వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావటం ఒకింత కీలక పరిణామమే. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా కూడా పాల్గొన్నారు. సో ..ఇది రాజకీయ భేటీనే అనే విషయం స్పష్టం. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ని కూడా తమతో కలుపుకోవాలని అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గట్టిగా భావిస్తున్నారు. ఇది ఏదో ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీ కి ఉన్న ఓటు బ్యాంకు చూసి కాదు...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల తెర వెనక కలిగే అనేక ప్రయోజనాల కోసం తప్ప మరికొటి కాదు. ఆంధ్ర ప్రదేశ్ ల్లో బీజేపీ కి ఉన్న ఓట్ల కంటే తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ కి ఉన్న ఓట్లు ఒకింత ఎక్కువే అని చెప్పొచ్చు. ఢిల్లీ లో అంతా సాఫీగా సాగి బీజేపీ అటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు..ఇటు తెలంగాణాలో లో కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అనే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా టీడీపీ శ్రేణులు తెలంగాణ లో బీజేపీకి ఓటు వేస్తాయా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఈజీగా కలిసి పోవొచ్చు. క్యాడర్ మాత్రం అంత ఈజీ గా కలవదు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీడీపీ అభిమానులు మాత్రం ఓపెన్ గానే టీడీపీ, బీజేపీ తో పొత్తుపెట్టుకున్నా తాము అసలు ఆ పార్టీ కి ఓటు వేసే ఛాన్స్ లేదు అని చెపుతున్నారు. టీడీపీ అభిమానులు ఆ పార్టీ అభ్యర్థి ఉంటే వాళ్లకు వేస్తారు కానీ..టీడీపీ లేని చోట కాంగ్రెస్..లేదంటే చివరకు బిఆర్ఎస్ కు అయినా వేస్తారు కానీ బీజేపీ కి వేయటం కష్టమే అని ఒక టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే తెలంగాలో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందివారు గత నాలుగేళ్ళ కాలంగా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరంతా గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో కేంద్రంలో మోడీ సర్కారు కూడా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఆ పార్టీ కూడా వివిధ అంశాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకుంది. అదే సమయంలో నిన్న మొన్నటి వరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కె లక్ష్మణ్ లు పలు మార్లు తాము తెలంగాణాలో ఒంటరిగానే వెళతామని, టీడీపీ తో పాటు ఎవరితో పొత్తు ఉండదు అని ప్రకటిస్తూ వచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ కేంద్ర నాయకత్వం లెక్కలు మారినట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు తో అమిత్ షా చర్చలు చేస్తున్నారు. పొత్తులు ఒక కొలిక్కి వస్తే అటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలోనే టీడీపీ, బీజేపీ, జనసేన లు జట్టుకట్టే అవకాశం ఉంది. కేంద్ర పెద్దలు సహకరిస్తే ఈ పొత్తుల వల్ల ఉంటే గింటే కాస్తో కూస్తో లాభం చంద్రబాబు కు ఉండొచ్చు అని...బీజేపీ కి ఏ మాత్రం ఉండదు అని చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు సాగటానికి నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే వైసీపీ, జగన్ అభిమానులు ఏ స్టాండ్ తీసుకుంటారు అన్నది కూడా కీలకం అవుతుంది. ప్రచారంలో ఉన్నట్లు టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని బీజేపీ నేతల పరిస్థితి అయితే ఉహించటమే కష్టం అని చెప్పొచ్చు.

Next Story
Share it