Telugu Gateway
Andhra Pradesh

దొంగ ఓట్లపై పరస్పరం ఫిర్యాదులు

దొంగ ఓట్లపై పరస్పరం ఫిర్యాదులు
X

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ను తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా వెళ్లి కలిశారు. వీళ్ళిద్దరూ ఆంధ్ర ప్రదేశ్ లో సాగుతున్న దొంగ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు, ఎన్నికల సమయంలో అక్రమ అరెస్ట్ లు, వాలంటీర్ల ను నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేయటం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడారు. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు.

ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అధికార వైసీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుర్తింపు లేని జనసేన ను ఎన్నికల సంఘం సమావేశానికి అనుమతించటం సరికాదు అని..ఇదే విషయంపై తాము ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి జనసేన ప్రస్తుతం బీజేపీ తో పొత్తులో ఉంది అని..కానీ తెలుగు దేశం పార్టీ బాగస్వామ్యపక్షం అని చెప్పి లెటర్ రాసినట్లు పవన్ కళ్యాణ్ ను ఈ సమావేశానికి తీసుకువచ్చారు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ కూడా తెలుగు దేశంపై పలు ఫిర్యాదులు చేసింది.

Next Story
Share it