Telugu Gateway
Andhra Pradesh

లోక్ సభ ఎన్నికల వేళ కొత్త సంకటం

లోక్ సభ ఎన్నికల వేళ కొత్త సంకటం
X

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ మద్దతు ఎవరికి?. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ...లోక్ సభ ఎన్నికల వేళ ఆరేళ్ళ తర్వాత తెలుగు దేశం పార్టీ మళ్ళీ ఎన్ డీఏ లో చేరింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ లు కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ ఇక్కడ పోటీ కి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు ఎంతో కలిసి వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోణంలోనే తెలుగు దేశం శ్రేణులు...అభిమానులు అంతా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కే మద్దతు ఇచ్చారు. ఒక్క జీహెచ్ఎంసి పరిధిలో తప్ప. ఇక్కడ అంతా ఎక్కువ రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు...టీడీపీ అభిమానులు కూడా బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు టీడీపీ ఎన్ డీఏ లో చేరటంతో తెలంగాణ టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది?. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రకటన చేస్తారా లేదా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ లో సాగించిన చర్చల్లో ఫోకస్ అంతా ఆంధ్ర ప్రదేశ్ మీద తప్ప ఎక్కడ తెలంగాణ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం బయటకు రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపర కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రయతనాలు చేస్తోంది.

తెలంగాణ సీఎం , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 14 లోక్ సభ సీట్లు టార్గెట్ గా పని చేస్తున్నట్లు చెపుతున్న విషయం తెలిసిందే. మరో వైపు బీజేపీ కూడా తెలంగాణ లో గతంలో వచ్చిన నాలుగు సీట్ల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు సాధించే ప్రణాలికలు సిద్ధం చేసుకుంటోంది. లోక్ సభ ఎన్నికల విషయంలో ఈ సారి ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ ల మధ్యే అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష బిఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు బిఎస్పీ తో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. అయినా సరే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు విషయంలో పార్టీ నాయకులే పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లో హోరా హోరీగా సాగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ మద్దతు ఆసక్తికర పరిణామంగా మరోబోతుంది. అయితే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ కి ఓట్లు వేయాలని పిలుపునిచ్చినా కూడా తెలంగాణ టీడీపీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ వైపు మాత్రమే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి ఉండటమే ...ఏపీలో అక్కడి పరిస్థితుల ఆధారంగా టీడీపీ బీజేపీ తో పొత్తు పెట్టుకుంది అని..ఈ కారణంగా తెలంగాణాలో టీడీపీ అభిమానులు ఎవరూ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదు అనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల నాటికి లెక్కల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి.

Next Story
Share it