ఆయనకు ఎలాగైనా లాభమే!

ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కీలక మంత్రి . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ తో కలిసి పని చేశారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. పైగా కొన్ని కంపెనీలు అంటే ఆయనకు మహా ఇష్టం. కళ్ళ ముందు పక్కా ఆధారాలు ఉన్నా కూడా వాటి గురించి నోరు తెరిచి మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఈ విషయంలో ఆయన లెక్కలు ఆయనవి. ప్రతిదీ ఆయన ఒక లెక్క ప్రకారమే చేస్తారు మరి. అధికారంలోకి వచ్చాక ..కీలక మంత్రి పదవి దక్కిన తర్వాత కూడా ఆయన ఏ మాత్రం మారలేదు అనే ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా వైసీపీ నేతలకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతే కాదు...రాజకీయ ప్రత్యర్దులు అయినా కూడా వాళ్లకు కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి కారణం తన మెజారిటీ వాటా తాను తీసుకుని ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎంతో కొంత అప్పగిస్తే వాళ్ళు కూడా ఈ విషయం లో మౌనంగా ఉంటారు అని..పని అంతా సాఫీగా సాగిపోతుంది అన్నది ఆయన ప్లాన్.
వందల కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాలో తుది దశకు చేరిన ఒక సాగునీటి ప్రాజెక్ట్ విషయంలో ఆ మంత్రి భారీగా దండుకుంటూ వైసీపీ నేతల నుంచి పెద్దగా విమర్శలు రాకుండా ఉండేందుకు వాళ్లకు కూడా కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. రాజకీయ నేతలకు..అధికారంలో ఉన్న వాళ్లకు కోట్ల రూపాయలు ఇచ్చే కాంట్రాక్టర్లు పనులు సరిగా చేస్తారా అంటే ఖచ్చితంగా అది జరిగే పని కాదు అని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్ట్ పనులు అత్యంత నాసిరకంగా సాగుతున్నా అదేమని ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా మాట్లాడారు. ఎప్పుడైనా మాట్లాడినా అది కూడా మొక్కుబడిగానే. ఈ సమస్యలు అన్ని లేకుండా ఉండేందుకే వాళ్లకు కూడా ఈ అవినీతి లో ఆ మంత్రి వాటాలు ఇస్తూ అందరూ కలిసి పంచుకున్నట్లు చెపుతున్నారు.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఎక్కువ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారు కానీ...పెద్దగా జిల్లా మంత్రుల జోలికి వెళ్ళరు అని ఒక టీడీపీ నేత వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం తెర వెనక జరిగే లావాదేవీలే అని చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి మాత్రం టీడీపీ నేతలు పలు జిల్లాల్లో వైసీపీ నేతలతో కలిసి డీల్స్ చేస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం అదిష్ఠానంలోని కీలక నేతల తీరు అనే చర్చ కూడా పార్టీ నాయకుల్లో ఉంది. టీడీపీ నాయకుల కంటే ఈ సారి వైసీపీ వాళ్ళకే ఎక్కువ పనులు అవుతున్నాయని ఒక సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.



