పొలిట్‌బ్యూరో నిర్ణయం విధానానికి మంగళం!

తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది మళ్ళీ అదే స్టైల్. తెలుగు దేశం తరపున బరిలో నిలిచే రాజ్య సభ అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత ఆయన తన పాత స్టైల్ వదులుకున్నట్లు లేదు అనే చర్చ సాగుతోంది. ఒక వైపు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లు ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించగా చంద్రబాబు నాయుడు మాత్రం నామినేషన్స్ రెండు రోజుల్లో ముగియనున్నాయి అనగా అంటే శనివారం రాత్రి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే టీడీపీ తరపున ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో రెండు పేర్లు మాత్రం రెండు నెలలకు ముందు నుంచే మీడియా లో వస్తూనే ఉన్నాయి. సానా సతీష్ తో పాటు భాష్యం రామకృష్ణ కు రాజ్య సభ టికెట్ లు దక్కటం ఖాయం అనే ప్రచారం పార్టీ వర్గాల్లో కూడా ఎప్పటి నుంచో ఉంది. చింతకాయల విజయ్ పేరు మాత్రం కొద్ది రోజుల నుంచే పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ అధికారికంగా ప్రకటించిన రాజ్య సభ అభ్యర్థుల్లో ఎలాంటి సర్ప్రైజ్ లు లేవు. కానీ దీని కోసం చంద్రబాబు ఇంత సమయం తీసుకోవటమే వింతగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతే కాదు...ఈ రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక చూస్తే మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
సానా సతీష్ కు రెన్యువల్ ఉంటుంది అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికి ప్రధాన కారణం ఆయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కావటం...గతంలో ఇచ్చిన టర్మ్ తక్కువగా ఉండటంతో ఆయన కు మళ్ళీ రాజ్య సభ ఛాన్స్ ఉంటుంది అనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అదే నిజం అయింది. భాష్యం రామకృష్ణ పేరు కూడా ముందు నుంచి ప్రచారంలోనే ఉంది. భాష్యం రామకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నది తక్కువే అయినా కూడా ఆయన పార్టీకి తెరవెనక నుంచి అందించిన సేవలకు గాను పదవి దక్కుతుంది అనే పార్టీ వర్గాలు చెపుతూ వస్తున్నాయి. అయితే ఈ సీటు విషయంలో ప్రధానంగా పోటీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణల మధ్య ఉంటుంది అని పార్టీ వర్గాలు చెపుతూ వచ్చాయి. ఫైనల్ గా టీడీపీ అధిష్ఠానం గల్లా జయదేవ్ కంటే భాష్యం రామకృష్ణ వైపు మొగ్గింది. దీని వెనక లెక్కలు వేరే ఉన్నాయి అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. సానా సతీష్ తో పాటు భాష్యం రామకృష్ణ ఇద్దరూ కూడా నారా లోకేష్ సన్నిహితులే అని పార్టీ నేతలు చెపుతున్నారు. పార్టీ పరంగానే కాకుండా వీళ్ళ బంధం ప్రత్యేకమైనది అని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మూడవ అభ్యర్థి చింతకాయల విజయ్ మొదటి నుంచి పార్టీ కారక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో చింతకాల విజయ్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఐ టీడీపీ బాధ్యతలు చూశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొదటి నుంచి నారా లోకేష్ టీం లోనే విజయ్ ఉన్నారు.
మొత్తం మీద ముగ్గురు రాజ్య సభ సభ్యుల ఎంపికలో నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ కీలక పదవుల నియామకంలో కూడా నారా లోకేష్ టీం కే పెద్ద పీట దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడు రాజ్య సభ సీట్లలో మూడు నారా లోకేష్ టీం కు వెళ్లటంతో పార్టీలో నారా లోకేష్ ఎంత పవర్ ఫుల్ గా మారారో అర్ధం అవుతోంది అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్య సభ ను పెద్దల సభ గా వ్యవహరిస్తారు. కానీ ఇంకా నిండా 45 సంవత్సరాల వయస్సు కూడా లేని చింతకాయల విజయ్ కు రాజ్య సభ సీటు కేటాయించటం మాత్రం విచిత్రంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఏకంగా రాజ్య సభ ఇవ్వటం అన్నది ఒకింత ఆశ్చర్యంగా ఉంది అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. చంద్రబాబు అయితే కచ్చితంగా వర్ల రామయ్య వైపు మొగ్గు చూపేవారు అని ఒక నేత అభిప్రాయపడ్డారు. వర్ల రామయ్య కుమారుడు ఎమ్మెల్యే గా ఉన్నారు అని ఆయన్ను రాజ్య సభకు కన్సిడర్ చేయలేదు అనే వాదన వస్తే చింతకాయల విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు అత్యంత కీలకమైన స్పీకర్ పదవి లో ఉన్న విషయం తెలిసిందే. ఇది అంతా చూస్తే పార్టీ లో...ప్రభుత్వంలో నారా లోకేష్ ప్రభావం ఎలా ఉందో అర్ధం అవుతోంది అనే వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అన్నిటి కంటే కీలకం ఏంటి అంటే ఈ సారి పొలిట్ బ్యూరో సమావేశం లాంటి ఏమి పెట్టకుండానే టీడీపీ తరపున రాజ్య సభ్య అభ్యర్థులను ప్రకటించారు. గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో నిర్ణయం చంద్రబాబు తీసుకున్నా కూడా పొలిట్ బ్యూరో సమావేశం పెట్టి పేర్లు ప్రకటించే వాళ్ళు. ఈ సారి ఆ విధానాన్ని కూడా ఎత్తేశారు.



