Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీలో చిడ‌త‌లు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో చిడ‌త‌లు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు
X

నిన్న విజిల్స్. నేడు చిత‌డ‌లు. ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేలు విచిత్ర కార్య‌క్ర‌మాల‌తో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నారు. దీంతో అధికార వైసీపీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేస్తోంది. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో అమూల్‌పై అడిగిన ప్రశ్నపై మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల చిడతలు కొట్టారు. అమూల్ వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభించేసింది అన్న వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల నిరసన భజన చేశారు. సభలో చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మీకు సంస్కారం ఉందా, ఇంగిత జ్జానం లేదా. శాసనసభ ఔన్నత్యాన్ని దిగజార్చుతున్నారు. సభలో విజిల్స్ వేస్తారు. భజన ఇక్కడ కాదు ఎక్కడికో వెళ్లి చేసుకోండి. మానవత్వం లేని వ్యక్తుల్లా వ్యవహిరస్తున్నారు.

దీని కోసమా ఇంత మంది త్యాగాలతో ఈ సభ. మీకు ఓటేసిన ప్రజలు చూస్తున్నారు. ఇవి పిల్లచేష్టలు'' అంటూ స్పీకర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ సభ్యుల చేతుల్లో నుంచి చిడతలు తీసుకోవాల్సిందిగా సభాపతి ఆదేశించారు. కల్తీ సారాపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండు చేస్తూ టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. మ‌రోవైపు టీడీపీ సభ్యులు సభలో చిడతలు కొట్టడంపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరకు చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు సభకు తాగొస్తున్నారేమోనని అనుమానంగా ఉందని.. డ్రంకెన్ టెస్ట్ చేయాలన్న జక్కంపూడి రాజా అన్నారు. పొరపాటున 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారంటూ మల్లాది విష్ణు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స‌భ్యులు అంద‌రూ ముక్త‌కంఠంతో స‌భ‌లో చిడ‌త‌లు వాయించిన ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేయాల‌ని కోర‌టంతో టీడీపీ ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేశారు.

Next Story
Share it