ఆ మీడియా సంస్థలపై ఎమ్మెల్యేలు ఆగ్రహం

ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలు ప్రజల కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలకే తెలుస్తాయి. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్లకు ప్రభుత్వంలో జరిగే అన్ని అంశాలకు చెందిన సమాచారం పక్కాగా ఉంటుంది. అదే ఇంకాస్త స్ట్రీట్ స్మార్ట్ ఎమ్మెల్యేలు అయితే లోతుగా కూడా సమాచారం సేకరిస్తారు. ప్రభుత్వం లోలోపల జరిగే విషయాలు కూడా పసిగట్టేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంపిక చేసిన మీడియా సంస్థలు పదే పదే కొంత మంది ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెస్తున్నాయి. అసలు ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ..ఆయన తనయుడు నారా లోకేష్ ఒక్కటంటే ఒక్క తప్పు చేయకపోయినా కూడా కేవలం ఎమ్మెల్యేలు మాత్రం దోపిడీ చేస్తున్నారు..తప్పులు చేస్తున్నారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ మీడియా అదే తరహాలో ప్రోజెక్ట్ చేస్తుంది. తప్పులు అన్ని ఎమ్మెల్యేలవే ...చంద్రబాబు, లోకేష్ మాత్రమే కష్టపడి పని చేస్తే ఎమ్మెల్యేలు అంతా చెడకొట్టారు అనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని ఒక ఒపీనియన్ బిల్డ్ అప్ చేసే ప్రయత్నం చేస్తారు.
ఈ ధోరణి పై కొంత మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల తప్పులు సరే మరి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు చేసే తప్పుల సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి టెండర్లలో అడ్డగోలుగా మంత్రి నారాయణ, అధికారులు చేస్తున్న గోల్ మాల్ సంగతి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు తెలియదా?. లేక వాళ్ళ ఆదేశాల ప్రకారమే నారాయణ, మున్సిపల్ అధికారులు అలా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు..విద్యుత్ ప్రాజెక్టు లను అడ్డగోలు గా ప్రైవేట్ కేటాయింపులు చేస్తున్నది ఎవరు?. జగన్ హయాంలో అక్రమంగా లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు అని ఆరోపించిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తో లాలూచి పడింది ఎవరు?. వైసీపీ హయం కంటే దారుణంగా నెల్లూరు జిల్లా గనులను ఒక బెంగళూరు కు చెందిన కాంట్రాక్టు సంస్థకు అప్పగించి తెర వెనక ఉండి కథ నడిపిస్తున్నది ఎవరు?.
వైసీపీ హయాంలో అడ్డగోలు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లకు కీలక స్థానాలు కట్టబెట్టింది ఎవరు?. వైజాగ్ లో ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నది ఎవరు?. విద్యుత్ ప్రాజెక్టు ల కేటాయింపుల్లో మెగా వాట్ కు ఇంత అని వసూలు చేస్తున్నది ఎవరు?. వైసీపీ నేతలకు కాంట్రాక్టు లు ఇవ్వవద్దు అని పైకి చెపుతూ విద్యా శాఖలో గత ప్రభుత్వంలో పని చేసిన వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్టులు వచ్చేలా చూస్తున్నది ఎవరు?. ఈ సారి ఎక్కువ మంది కొత్త వాళ్ళను మంత్రులను చేసి అన్ని శాఖల్లో అనధికారికంగా అధికారం చలాయిస్తున్నది ఎవరు?. ఒక మంత్రి పేరు చెప్పి పోస్టింగ్ ల దగ్గర నుంచి మైనింగ్ లీజ్ ల కేటాయింపులో చక్రం తిప్పింది ఎవరు? . ఇలా పుట్టిన కంపెనీల అలా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు లను కట్టబెడుతున్నది ఎవరు? ఇలా చెప్పుకుంటే పోతే ఈ జాబితాకు అంతే ఉండదు అని టీడీపీ కి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.
పైన ఉన్న వాళ్ళు ఎవరికీ తోచిన విధంగా అడ్డగగోలుగా దోపిడీ చేస్తుండటంతోనే ఎమ్మెల్యేలు కూడా అదే పనిలో ఉన్నారు అని ఒక సీనియర్ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. తానా, నాట్స్ సమావేశాలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కూడా కొంత మంది ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. ఐదేళ్లు నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే ఒక పది, పదినేను రోజులు విదేశాలకు వెళ్లి వస్తే పెద్ద గా కొంపలు ముంచుకుపోయేది ఏమి ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ లు మాత్రం ఎన్ని సార్లు ఆయినా విదేశీ పర్యటనలు చేయవచ్చు కానీ..రెండేళ్లకు ఒక సారి జరిగే తానా సభలకు పోవటంపై చంద్రబాబు అంతగా స్పందించాల్సిన అవసరం ఉందా అని మరికొంత మంది సందేహం వ్యక్తం చేశారు. ఎక్కడి వరకో ఎందుకు అధికారంలోకి వచ్చిన తోలి ఏడాదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు కూడా చాలా సార్లు వీకెండ్స్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అధికార పార్టీ కి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తప్పులు..అక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే అని...అయితే దీనికి ప్రధాన కారణం పై స్థాయిలో జరుగుతున్న తప్పులే అని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇష్ఠానుసారం చేసుకుంటూ మిగిలిన వాళ్ళు మాత్రం ఎవరూ తప్పు చేయవద్దు అంటే వినటానికి ఎమ్మెల్యేలు ఏమైనా పిచ్చివాల్లా అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ సారి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో అవినీతి సాగుతోంది అని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.