గంటా రెండో సారి రాజీనామా
తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రెండోసారి రాజీనామా చేశారు. గతంలో ఓ సారి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో అంటూ రాజీనామా చేశారు. సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే పదవికి ఎలా రాజీనామా చేయాలో తెలియంది కాదు..ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లేదని అన్నారని రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆ రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీని కలిసి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని గంటా శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. కేంద్రానికి సీఎం జగన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నామన్నారు. అయితే లేఖలు రాస్తే ఢిల్లీలో పెద్దల మనసు కరగదన్నారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్ భేటీ పెట్టాలని, తెలంగాణ తరహా మిలియన్ మార్చ్ చేయాలని గంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.