పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు..నారా లోకేష్ మోడీ కి !

రాజకీయ నాయకులు పైకి చెప్పేది ఒకటి. వాస్తవానికి వాళ్ళు చేసేది మరొకటి. తమ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు అవసరం ఉన్న ప్రతి చోట రాజీ పడుతూ...వాటిని కూడా రాష్ట్ర అవసరాల కోసం అనో ...దేశ అవసరాల కోసం అనో చెప్పగల సమర్థులు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పదే పదే ఒక మాట చెప్పుకుంటూ పోతున్నారు. అది జనసేన నేతలు..క్యాడర్ కు ఏ మాత్రం నచ్చకపోయినా ఆయన మాత్రం ఆ జపం ఆపటం లేదు.మరో పదిహేను సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబే ముఖ్యమంత్రిగా..కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అని చెపుతున్నారు. ఏ కారణం వల్ల అయినా విడిపోతే మళ్ళీ రాష్ట్రం అరాచక శక్తుల చేతుల్లోకి వెళుతుంది అని పవన్ కళ్యాణ్ చెపుతూ వస్తున్నారు. దీనిపై ఒక జనసేన కీలక నేత ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. సొంతంగా అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడాలి. వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలి. ముందుగా పవన్ కళ్యాణ్ కు అసలు అంత కష్టపడే ఓపిక లేదు అని...ఉన్నా కూడా డబ్బు ఖర్చుపెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఉన్న మోడల్ పవన్ కళ్యాణ్ కు ఎంతో సౌకర్యంగా ఉంది అని...పదవికి పదవితో పాటు అన్ని లాభాలు ఉన్నందునే పవన్ కళ్యాణ్ పదే పదే అదే జపం చేస్తున్నారు అని జనసేన నేతలు చెపుతున్నారు.
పైగా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఒంటరిగా కష్టపడితే ఇప్పుడు ఉన్న సీట్లు సాధించటం కూడా సాధ్యం కాదు అన్నది ఆ పార్టీ నాయకుల విశ్లేషణ. పవన్ కళ్యాణ్ పక్కకు పోతే మాత్రం వైసీపీ కి అవకాశాలు మెరుగు అవటం తప్ప మరో ఉపయోగం ఉండదు అని..ఏ రకంగా చూసుకున్నా జగన్ తో కలవటం కంటే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు తోనే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది అని ఒక సీనియర్ నేత చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే గత కొంత కాలంగా చంద్రబాబు జపం చేస్తున్నారో అలాగే ఇప్పుడు నారా లోకేష్ కూడా అలాగే మోడీ జపం చేస్తున్నారు అని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడిన నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో అంటే 2029 లో కూడా ఎన్డీయే కు మద్దతు ఇస్తామని...మోడీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉంది అని చెప్పారు. నాలుగవసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటం అంటే అసాధారణమే అవుతుంది. అసలు బీజేపీ ..ఆర్ఆర్ఎస్ లు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ముందు పెడతాయో కూడా ఇప్పటికి తెలియదు. మరో వైపు ఏ వయసు లెక్కలు చెప్పి గతంలో మోడీ అండ్ టీం బీజేపీ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన అద్వానీ, మురళి మనోహర్ జోషి వంటి వాళ్లను పక్కకు జరిపారో..ఇప్పుడు అదే విధానం మోడీకి అమలు చేయాలి అనే డిమాండ్ కూడా సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ నాయకత్వానికి తమ మద్దతు అని ప్రకటించటం అంటే ఇది పూర్తి గా సరెండర్ అవటం తప్ప మరొకటి కాదు అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అప్పటి పరిస్థితిని బట్టి వ్యూహాలు ఖరారు చేసుకుంటుంది. కానీ ఇంత ముందస్తు ప్రకటనలు అంటే అది తాము సరెండర్ అయిన విషయాన్ని మరో సారి గుర్తు చేయటం తప్ప మరొకటి కాదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఒక వైపు జగన్ తో పాటు చంద్రబాబు కూడా కేసు లతో రకరకాల కారణాలతో ఈ సారి పూర్తి మోడీ కి సరెండర్ అయ్యారు అనే చర్చ టీడీపీ నాయకుల్లో కూడా సాగుతోంది. జగన్ తో పోలిస్తే చంద్రబాబు పై ఉన్న కేసు లు అంతగా లెక్కలోకి వచ్చేవి కాకపోయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది అంటే అది చేయగలదు అనే విషయం ఇప్పటికే ఎన్నో సార్లు ప్రూవ్ అయినందున చంద్రబాబు ఈ సారి గతానికి ఎంతో బిన్నంగా మోడీ ఏది చెపితే అదే రైట్ అనే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు నారా లోకేష్ మరో అడుగు ముందుకు వేసి తాము గల్లీ రాజకీయాలే చేస్తాం...వచ్చే ఎన్నికల్లో కూడా మోడీకే మా మద్దతు అని చెప్పటం అంటే అంతకు మించిన సాగిలపడటం మరొకటి ఉండేది అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2014 లో టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేశాయి. అక్కడా..ఇక్కడ అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో తొలి సారి మోడీ ప్రధాని అయినప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పీఎంఓ లో తన తరపున ఒక అధికారిని పెట్టేందుకు ప్రయత్నం చేయగా..దానికి మోడీ నో చెప్పినట్లు ఐఏఎస్ సర్కిల్స్ లో ప్రచారం లో ఉంది. కానీ ఈ సారి మాత్రం గత అనుభవాల దృష్ట్యా డే వన్ నుంచి మోడీ కి చంద్రబాబు పూర్తి సరెండర్ అయ్యారు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేకపోయినా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ మద్దతు కోరితే అటు చంద్రబాబు కానీ..ఇటు పవన్ కళ్యాణ్ కానీ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వీళ్ళు ఎంతగా సరెండర్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు అనే చర్చ రెండు పార్టీ ల్లోనూ సాగుతోంది.



