Telugu Gateway
Andhra Pradesh

మాకు ఏడు...మీకు ఐదు

మాకు ఏడు...మీకు ఐదు
X

ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలే అల వోకగా అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ మంతటా కూడా జరుగుతున్న వ్యవహహారమే. ఈ వ్యవహారం కోర్టు లకు చేరుతున్నా కూడా ఈ కేసు లు తేలేనాటికి వాళ్ళ వాళ్ళ టర్మ్ లు కూడా ముగిసిపోయాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామం ఒకింత విచిత్రంగా ఉంది...ఆశ్చర్యకరంగా ఉంది. ఫిరాయింపులు వింత ఏమి కాకపోయినా ఈ ఫిరాయింపు దారులను కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జన సేన లు వీళ్ళను పంచుకోవటం అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది అంతా చోటు చేసుకున్నది విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవిఎంసి ) కార్పొరేటర్లకు సంబంధించిన వ్యవహారంలో. ప్రస్తుతం జీవిఎంసి మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉంది. అత్యంత కీలకమైన విశాఖపట్నం మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం కోసం అధికార పార్టీ పావులు కదిపి...ఈ దిశగా ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వైసీపీ నుంచి పార్టీ మారిన 12 మంది కార్పొరేటర్ల లో ఏడుగురు తెలుగు దేశం పార్టీ లో...మరో ఐదుగురు జన సేన లో చేరటమే వెరైటీ గా ఉంది అని చెప్పాలి.

అంటే ఇక్కడ ఫిరాయింపుల విషయంలో కూడా పొత్తులో ఉన్న పార్టీ లు వాటాలు వేసుకున్నాయా..లేక దీని వెనక వేరే కథ ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫిరాయింపు కార్పొరేటర్ల పంపకం విషయంలో మరో భాగస్వామి పార్టీ బీజేపీ కి టీడీపీ, జన సేనలు అన్యాయం చేసినట్లు ఉంది అంటూ కొంత మంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు కూడా. సహజంగా ఫిరాయింపులు అధికార పార్టీ లోకే ఎక్కువగా ఉంటాయి. కానీ విశాఖపట్నం విషయానికి వస్తే కార్పొరేటర్లను చేర్చుకున్న విధానం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అనే చెప్పాలి. కార్పొరేటర్ లు అందరిని టీడీపీ గుండుగుత్తగా చేర్చుకుంటే మళ్ళీ జనసేన రాజకీయంగా ఏదైనా సమస్యలు సృష్టిస్తుంది అని భయపడి అలా చేశారా...లేక నిజంగా పార్టీ మారుతున్నా కార్పొరేటర్ల ఛాయిస్ ప్రకారమే ఇది జరిగిందా అన్నది వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఏది ఏమైనా ఈ పరిణామం మాత్రం చూసే వాళ్లకు కాస్త వింతగా ఉంది అనే చెప్పాలి.

Next Story
Share it