టీడీపీలో వంద మందితో సూసైడ్ బ్యాచ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడేవారికి బుద్ధి చెప్పేందుకు వంద మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేసుకున్నామని.. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్దమని వెల్లడించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్‌పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
సీనియర్లను కాదని జోగి రమేష్‌కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతలే చెప్పారన్నారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జోగి రమేష్ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి చేరుకోవటం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.