ఏపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం వింతగా ఉందన్నారు. రెండేళ్లలో ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆమోదించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఆర్డినెన్స్ లతోనే బడ్జెట్ లు పాస్ చేసుకుంటోందని విమర్శించారు. ఆయన మంగళవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. మార్చిలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కరోనాకు కారణం చూపించిన ప్రభుత్వం....ఇప్పుడు ఎలా సమావేశాలకు సిద్ధం అయ్యిందని ప్రశ్నించారు. కరోనా కేసులు లక్షల్లో ఉన్నప్పుడు అసెంబ్లీ నిర్వహించడం ఎందుకన్నారు. కోవిడ్ నియంత్రణపై ఇప్పటి వరకు అఖిలపక్షం సమావేశం లేదు.....నిపుణులైన వైద్యులు అభిప్రాయాలు తీసుకోవడం లేదు... ఆరు నెలలకు ఒక్క సారైనా అసెంబ్లీ సమావేశం పెట్టాలి కాబట్టి పెడుతున్నారు. చర్చల కోసం అసెంబ్లీ సమావేశం పెట్టడం లేదని ఆరోపించారు.
కోవిడ్ కు చికిత్స చేయించలేని ప్రభుత్వం అంత్యక్రియలకు డబ్బులు ఇస్తుందని ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలను ఆదుకోవాలన్నారు. మాక్ అసెంబ్లీ జూమ్ ద్వారా పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియ జేస్తామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కోవిడ్ తో వేలాది మంది చనిపోతుంటే ప్రబుత్వానికి పట్టడం లేదన్నారు. ప్రభుత్వం అప్రమత్తం గా లేదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. చట్ట సభలపై సీఎం కు నమ్మకం లేదని విమర్శించారు.