అన్న విషయం చూసుకుని వర్మ విషయం వదిలేసిన పవన్ !
మాట ఇచ్చి...దాన్ని పక్కన పెట్టే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై చాలానే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇది ఎన్నో సార్లు నిరూపితం అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇదే అంశం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల ముందు అత్యంత కీలకంగా మారిన సీటు పిఠాపురం. పొత్తులో భాగంగా ఈ సీటు ను జనసేన అధినేత కు కేటాయించారు. తొలుత దీనికి నిరాకరించి..ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి శాంతిపచేశారు. దీంతో గత ఎన్నికల్లో వర్మ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు వర్మకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. పొత్తులో భాగంగా అన్న నాగబాబు కు ఎమ్మెల్సీ సీటు ఓకే చేయించుకున్న పవన్ కళ్యాణ్ కూడా వర్మ విషయంలో తన వంతుగా ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెపితే కచ్చితంగా దీనికి చంద్రబాబు దగ్గర వెయిట్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే వర్మ విషయంలో చంద్రబాబు కు బాధ్యత 75 శాతం ఉంటే..పవన్ కళ్యాణ్ కు కూడా 25 శాతం ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి కోసం చంద్రబాబు కు ఒక మాట చెప్పిన సీటు వచ్చేలా చూస్తే పవన్ కళ్యాణ్ కు కూడా గౌరవం పెరిగి ఉండేది అని...కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మాత్రం అలా కాకుండా కేవలం తన అన్న సీటు విషయం ఒక్కటి చూసుకుని వర్మను వదిలేశారు అనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కోక తప్పదు అనే చెప్పొచ్చు.
గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన దేవినేని ఉమా మహేశ్వర్ రావు తో పాటు ఎంతోమంది ఆశావహులకు చంద్రబాబు మరో సారి హ్యాండ్ ఇచ్చి...బీజేపీ కి ఒక వైపు రాజ్య సభ సభ్యత్వాలతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కూడా కేటాయించడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. వైసీపీ నుంచి రాజ్య సభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ కు కూడా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అయినా సరే ఆయన కు ఈ సారి మొండిచేయి చూపించారు. మొత్తం ఎమ్మెల్యే కోటాలో వచ్చే ఐదు సీట్లలో ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీ కి కేటాయించి టీడీపీ తరపున ముగ్గురు పేర్లను ఈ సీట్లకు ఖరారు చేశారు. ఇందులో మాజీ స్పీకర్ ప్రతిభ భారతి కుమార్తె కావాలి గ్రీష్మ, బీద రవి చంద్ర, బీటీ నాయుడులకు టీడీపీ కోటాలో సీట్లు కేటాయించారు. సోమవారం నాడు నామినేషన్ల దాఖలు చివరి తేదీ కావటంతో కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకున్న వాళ్ళు నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.