Telugu Gateway
Andhra Pradesh

ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్లేస్

ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్లేస్
X

దట్టమైన అడవి ప్రాంతం. చుట్టూ ఎత్తైన కొండలు. ఆ కొండల మధ్య నుంచి ఆకాశం నుంచి జాలువారుతున్నట్లు జలపాతం నీళ్లు వచ్చిపడుతుంటే ప్రకృతి ప్రేమికులకు ఇంకేమి కావాలి. ఈ సుందర దృశ్యాన్ని చూడాలంటే తిరుపతి సమీపంలోని తలకోన జలపాతానికి వెళ్లాల్సిందే. 270 అడుగుల ఎత్తుతో తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్ లోనే ఆత్యంత ఎత్తైన జలపాతంగా నిలిచింది. తిరుపతి నుంచీ బాకరాపేట మీదుగా 57 కిలోమీటర్ల దూరం వెళ్తే తలకోన వస్తుంది. తలకోనలోని సిద్దేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో జలపాతం ఉంటుంది. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే కొద్ది దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే బస్సు లు..కార్లు ఒక ప్రాంతం వరకే అనుమతిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తలకోన జలపాతం కూడా ఉంటుంది.

ఈ అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులు, అరుదైన అటవీ సంపదకు నెలవు. సూర్య కిరణాలు కూడా నేలను తాకనంతగా దట్టంగా ఉండే తలకోన అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. తలకోనలో రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్న కొండపై నుంచి కిందకు దూకే జలపాతాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతారు. ముఖ్యంగా యువత ఆ జలపాతం కిందకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అక్కడ అన్నీ రాళ్లే ఉండటంతో ఎంతో జాగ్రత్తగా మాత్రమే జలపాతం కిందకు వెళ్లాల్సి ఉంటుంది. తలకోన అటవీ ప్రాంతం మొత్తం 27,228 హెక్టార్ల విస్తీర్ణం లో ఉంది. 178 రకాల పక్షి జాతులు, 342 రకాల అరుదైన జంతుజాతులు ఇక్కడ ఉంటాయి.

ఈ అడవికి తలకోన అనే పేరు రావడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ఉందని చెపుతారు. ఆదిశేషుడే శేషాచలంగా పర్వతం రూపంలో వెలిశాడని వేదాల్లో ఉన్నట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక బోర్డులో రాసింది. పద్మావతిని పెళ్లి చేసుకోడానికి కుబేరుడి నుంచి అప్పు తీసుకున్న శ్రీనివాసుడు, ఆ అప్పు తీర్చే సమయంలో డబ్బు కొలిచి కొలిచి అలసిపోవడంతో ఈ కొండపై తలవాల్చి నిద్రపోయారని, అందుకే ఆయన తలవాల్చిన కోన కనుక తలకోన అయ్యిందని టీటీడీ బోర్డులో ఉంటుంది. మరో లెక్క ప్రకారం తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు అని చెపుతారు. అయితే ఇందులో ఏది నిజం అన్న విషయంపై స్పష్టత లేదు. కాకపోతే పర్యాటకపరంగా ఇది ఎంతో ప్రాముఖ్యత దక్కించుకున్న ప్రాంతం అనే చెప్పాలి.

Next Story
Share it