సుప్రీంలో జగన్ పై కేసులు కొట్టివేత
కీలక పరిణామం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. సీజెఐకి సీఎం జగన్ రాసిన లేఖపై పలు పిటీషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే. అందులో వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ కూడా ఉంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా.. గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది సీజేఐ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని, లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. పిటిషన్లలో అభ్యర్థనలు అన్ని గందరగోళంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని, నిధులు ఎక్కడివని, ధర్మాసనం ప్రశ్నించింది. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది.